24.7 C
Hyderabad
Saturday, July 13, 2024
spot_img

తెలంగాణలో కమలం దళపతి ఎవరు ?

      లోక్‌సభ స్పీకర్ ఎన్నిక పూర్తవడంతో ఇక త్వరలోనే పార్టీలో మార్పులపై కమలం అధినాయకత్వం ఫోకస్ పెట్టబోతోందా? పలు రాష్ట్రాల సారథులను మార్చాలని యోచిస్తోందా అంటే అవునన్న సమాధానం విన్పి స్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు ఎవరు? అన్నదానిపై జోరుగా చర్చ సాగుతోంది.ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న కిషన్ రెడ్డికి మరోసారి కేంద్రమంత్రి పదవి దక్కడంతో ఆయన ప్లేస్‌లో ఎవరికి అవకాశం దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. పలువురు నేతల పేర్లు విన్పిస్తున్నా రాష్ట్ర కమల సారథిగా ఎవరికి అవకాశం దక్కుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది.

    తెలంగాణలో కమలదళాన్ని నడిపించేదెవరు ? ఇదే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా విన్పిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పటికే కిషన్ రెడ్డి ఉన్నా ఆయనకు కేంద్రంలో మంత్రి పదవి దక్కింది. దీంతో కిషన్ రెడ్డి స్థానంలో మరో నేతకు బాధ్యతలు అప్పగించాలని యోచిస్తోంది బీజేపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బీజేపీ నేతల్లో ఎవరికి రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి దక్కుతుందన్నది ఆసక్తి కరంగా మారింది. రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇందుకు కారణం తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గతంలో కంటే కమలనాథులు మంచి ఫలితాలు సాధించారు. ఇక, ఇటీవలె జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ 2019కి భిన్నంగా 8 ఎంపీ సీట్లు సాధించి కాంగ్రెస్‌ పార్టీకి గట్టి పోటీ ఇచ్చారు. దీంతో ఇటు అధికార కాంగ్రెస్‌కు, అటు విపక్ష బీఆర్‌ఎస్‌ను సమర్థంగా ఎదుర్కొనే నేత కోసం కొంతకాలంగా అన్వేషిస్తోంది బీజేపీ అధినాయకత్వం. ఎలాగూ ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి కేంద్రంలో మంత్రి పదవి దక్కడంతో ఆయన స్థానంలో ఎవరికి ఇవ్వాలన్న దానిపై గట్టి కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

    రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కోసం ప్రధానంగా విన్పిస్తున్న పేర్లలో మొదటిది ఈటల రాజేందర్. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత, అందులోనూ బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం,తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేసి ఉండడంతో రాష్ట్రంలో అడుగడుగూ ఈయనకు అవగాహన ఉంది. పైగా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అన్న నాయకుడిగా ఈటలకు ప్రజల్లో మంచి గుర్తింపు సైతం ఉంది. పైగా తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసిన ఈటల మంచి మెజార్టీతో విజయం సాధించారు. దీంతో ఈటల రాజేందర్‌కు కేంద్ర మంత్రివర్గంలోనూ చోటు దక్కవచ్చన్న ఊహాగానాలు విన్పించాయి. కానీ, ఆయనకు అవకాశం లభించ లేదు. అదే సమయంలో బీజేపీ అగ్రనేత అమిత్ షా నుంచి పిలుపు రావడంతో ఆయన వెళ్లి భేటీ అయ్యారు. దీంతో కిషన్ రెడ్డి స్థానంలో ఈటలను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తారన్న ప్రచారం గట్టిగా సాగుతోంది. కమల దళపతి రేసులో విన్పిస్తున్న మరో పేరు డి.కె. అరుణ. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈమెకు మంచి పరిచయాలు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ హయాంలో మంత్రిగానూ పనిచేశారు డీకే అరుణ. ఇటీవలె జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ స్థానం నుంచి ఆమె సంచలన విజయం సాధించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఉన్న ఎంపీ స్థానం హస్తం చేతి నుంచి జారడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫలితంగా డీకే అరుణ పేరు ప్రచారంలో ఉంది. పైగా మహిళ కావడం కూడా ఈమెకు కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు.

     ఇక, నిజామాబాద్‌ నుంచి ఎంపీగా గెలిచిన ధర్మపురి అర్వింద్ పేరు కూడా ప్రముఖంగా విన్పిస్తోంది. పార్టీలో ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు పొందిన ఆయన కేసీఆర్ టార్గెట్‌గా చెలరేగిపోతుంటారు. ఇక, మెదక్ నుంచి గెలిచిన ఎంపీ రఘునందన్ రావు పేరు పైనా ప్రచారం సాగుతోంది. మంచి వాగ్దాటి ఉన్న నేత కావడం రఘునందన్ రావుకు కలిసి వచ్చే అంశం. మరోవైపు కామారెడ్డి నుంచి గెలిచిన వెంకట రామిరెడ్డి పేరు సైతం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం విన్పిస్తోంది. ఇప్పటికే బీజేఎల్పీ పదవి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహేశ్వర్ రెడ్డికి ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలకు లేదంటే మరో సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి మోడీ-షా మనసులో ఏముందో ఎవరికి రాష్ట్ర సారథ్య బాధ్యతలు దక్కేనో అన్నది ఆసక్తి రేపుతోంది.

Latest Articles

కూటమి సర్కార్ పై నిప్పులు చెరిగిన షర్మిల

కూటమి సర్కార్ పై కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వందల కోట్లు ఇచ్చి.. అభివృద్ధి చేసింది కేవలం దివంగత వైఎస్ఆర్ మాత్రమేనని.. ఆ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్