ఏపీ బీజేపీలోకి వలసలు లేకపోవడంపై హైకమాండ్ సీరియస్‌గా ఉందా? ఎందుకు పార్టీ బలోపేతానికి కృషి చేయడం లేదని రాష్ట్ర చీఫ్ పురంధరేశ్వరిని నిలదీసిందా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చాయి. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆ మూడు పార్టీలు ఎవరికి వారే రాజకీయంగా బలపడే ప్రయత్నం చేస్తున్నాయి. సాధ్యమైనంత వరకు వైసీపీలోని బలమైన లీడర్లను తమ పార్టీల్లో చేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. టీడీపీ కంటే జనసేన ఈ చేరికలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.
కూటమిలో ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం తన బలాన్ని పెంచుకునే ప్రయత్నంచేస్తోంది. ఇప్పటికే వైసీపీ నుంచి చాలా మంది టీడీపీ వైపు వెళ్లారు. ఇక జనసేన కూడా బలమైన నాయకులను ఎంపిక చేసుకొని మరీ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను, గంజి చిరంజీవి వంటి నాయకులను జనసేనలో చేర్చుకున్నారు. ఈ రెండు పార్టీలో వలస నాయకులను చేర్చుకుంటున్నా.. బీజేపీ మాత్రం ఎలాంటి చేరికలను ప్రోత్సహించడం లేదనే టాక్ వినిపిస్తోంది.
వాస్తవానికి వైసీపీ నుంచి వలస వెళ్తున్న నాయకులు తమ ఫస్ట్ ఛాయిస్‌గా టీడీపీని ఎంచుకుంటున్నారు. అక్కడ చోటు లేకపోతే.. జనసేనలోకి వెళ్తున్నారు. కానీ బీజేపీలోకి వెళ్లడానికి ఎవరూ సుముఖంగా లేరు. రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగా పుంజుకోవడం కష్టమనే భావనలో ఉన్న నాయకులు.. ఆ పార్టీవైపు కన్నెత్తి చూడం లేదటా. అయితే ఇటీవల కొంత మంది నాయకులు బీజేపీలో చేరాలని ప్రయత్నించినా.. వారి విషయంలో రాష్ట్ర నాయకత్వం ఓకే చెప్పలేదట. నాయకులే స్వయంగా పార్టీలో చేరతామని చెప్పినా.. బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రం వద్దని చెప్పినట్లు టాక్ వినిపించింది.
అసలు వలస నాయకులను ఎందుకు చేర్చుకోవడం లేదని ఢిల్లీ పెద్దలు కూడా సీరియస్ అయ్యారట. వెంటనే రాష్ట్ర చీఫ్ దగ్గుబాటు పురంధరేశ్వరిని ఢిల్లీకి పిలిపించి.. ఈ విషయమై ఆరా తీసినట్లు తెలిసింది. ఏపీలో టీడీపీ కొందరు వైసీపీ నేతలను టార్గెట్ చేసిందట. అలాంటి నాయకులు రాజకీయ ఆశ్రయం కోసం బీజేపీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారట. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలో చేర్చుకోవద్దని టీడీపీ సూచించిందట. అందుకే బీజేపీ కొత్త నాయకులను చేర్చుకోవడం లేదనే టాక్ వినిపించింది.
ఇటీవల విశాఖపట్నానికి చెందిన ఒక మాజీ మంత్రి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరాలని ప్రయత్నించారట. అయితే టీడీపీ అధిష్టానం ఆయన రాకకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో ఆయన జనసేనతో సంప్రదింపులు జరిపారట. అక్కడ కూడా చుక్కెదురు కావడంతో.. చివరకు బీజేపీలోకి వెళ్లాలని ప్రయత్నించారట. అయితే అతడిని చేర్చుకోవద్దని టీడీపీ చెప్పడంతోనే బీజేపీ కూడా వెనక్కు తగ్గినట్లు తెలిసింది. ఆ మాజీ మంత్రి మాత్రమే కాకుండా పలువురు వైసీపీ నాయకులు కూడా బీజేపీలో చేరాలని భావించినా.. వారి చేరికకు కొన్ని రాజకీయ శక్తులు అడ్డు తగులుతున్నట్లు తెలిసింది.
కోస్తా జిల్లాలత్గో పాటు రాయలసీమలో కూడా వైసీపీ నుంచి జనసేనలో చేరేందుకు కొంతమంది నేతలు సిద్ధపడుతున్నారుట. కానీ వారికి గ్రీన్ సిగ్నల్ లభించడం లేదని అంటున్నారు. దీంతో బీజేపీ కేంద్ర నాయకత్వం ఏపీ మీద ఫుల్ ఫోకస్ పెట్టింది అని అంటున్నారు. ఎవరేమి అనుకున్న చేరేందుకు వచ్చిన నాయకులు కమలం కండువా కప్పేసి చేర్చుకోవాలని కేంద్ర పెద్దలు ఆదేశించినట్లు టాక్ వినిపిస్తోంది. రాజకీయంగా బలపడేందుకు ఉన్న అవకాశాలను వదులుకోవద్దని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది. దాంతో బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరికలు తొందరలోనే ఉంటాయని తెలుస్తోంది.
త్వరలోనే బీజేపీలో భారీగా చేరికలు ఉంటాయని.. ఈ విషయంలో బీజేపీ హైకమాండ్ రాష్ట్ర నాయకత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ చేరికల వల్ల కూటమిలో ఏమైనా ఇబ్బందులు వస్తాయా అదే విధంగా ఆయా నియోజకవర్గాల్లో వర్గ పోరు పెరుగుతుందా అనేది చూడాలి మరి.