విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం పుణ్యగిరిలో ప్రసిద్ధ శైవక్షేత్రం జాతరకు వేళయింది. పుణ్యగిరి జాతరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం మూడు రోజుల పాటు పుణ్యగిరి జాతర జరుగుతుంది. ఈ నెల 26న మహాశివరాత్రి సందర్భంగా వేలాదిగా తరలివచ్చే భక్తులకు దేవాదాయశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
చుట్టూ ఎత్తయిన కొండలు.. గలగల పారే జలపాతాలు.. ప్రకృతి సోయగాల మధ్య టూరిజం.. ఆధ్యాత్మిక చింతనకు ఆలవాలమైంది పుణ్యగిరి. భక్తులకు ముక్తి ప్రసాదిస్తున్నాడు పుణ్యగిరి శ్రీ ఉమా కోటిలింగేశ్వరస్వామి. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే కాకుండా దక్షిణ భారతదేశంలో పరమ పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచింది పుణ్యగిరి. దక్షిణ కాశీగా పిలుచుకునే పుణ్యగిరి దాదాపు 7 వేల సంవత్సరాల క్రితం ఇక్కడ శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామిగా ప్రతిష్ఠించినట్లు చెబుతారు.
ఈ ప్రాంతంలో రుషులు తపస్సు చేసి, శివుడిని ప్రసన్నం చేసుకున్నారని పుట్టుదార కింద ఉమా కోటిలింగేశ్వర స్వామిగా శివలింగ రూపంలో స్వయంభువుగా వెలిసినట్లు పురాణ గాధ. ద్వాపర యుగంలో పాండవులు నడయాడిన ప్రాంతం పుణ్యగిరి అని పురాణ గాథలు ఉన్నాయి. పాండవుల అజ్ఞాతవాస కాలంలో పుణ్యగిరికి 10 కిలోమీటర్ల దూరంలోని విరాట పర్వతం వద్ద విరాటరాజు కొలువు ఉండేదంటారు. విరాటరాజు బావమరిది కీచకుడి శృంగార కలాపాలకు శృంగారకోట నిర్మించినట్లు చెబుతారు. అదే తర్వాత కాలంలో శృంగవరపుకోటగా మారిందని అంటారు.
విరాట కొలువు నుంచి పుణ్యగిరికి ప్రతిరోజూ పాండవులు వచ్చి శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామిని పుట్టుధారతో అభిషేకించేవారని నానుడి. పుట్టుధార దక్షిణం నుంచి ఉత్తర దిశగా ప్రవహించి, శివలింగాన్ని అభిషేకిస్తూ ప్రవహించడం ఇక్కడ విశేషం. ఈ ధార ఎక్కడి నుంచి వస్తుందో నేటికీ అంతుపట్టని రహస్యం.
పుణ్యగిరికి వచ్చే భక్తులు ఈ పుట్టుదారలో స్నానం చేసి ఆ పరమశివుని దర్శించుకుంటారు. ఇలా దర్శించుకుంటే పాపాలన్నీ పోయి, మోక్షం వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ధార గంగమ్మ లోయలోని త్రినాధ గుహలో ఆవు పొదుగు మాదిరిగా ఉన్న ఆకారాల నుంచి జలధారలు శివలింగంపై పడి అభిషేకించడం ఇక్కడి విశేషం. మరణించిన వారి అస్థికలు ఈ ప్రాంతంలోని అస్థిక మండపం వద్ద కలిపితే నేరుగా కైలాసం వెళ్తారని నమ్మకం.
శివరాత్రి పర్వదినం సందర్భంగా మూడు రోజుల పాటు విజయనగరం, విశాఖపట్నం నుండి శృంగవరపుకోట వరకు నేరుగా బస్సులు నడుపుతారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి భక్తులు పుణ్యగిరికి వస్తారు.