జగన్ గుంటూరు యార్డు పర్యటన నేపథ్యంలో నిన్న చోటుచేసుకున్న ఘటనపై వైసీపీ నేతలు భగ్గుమన్నారు. మిర్చి రైతుల పరామర్శ సమయంలో జగన్‌కు పోలీస్ భద్రత కల్పించకపోవడాన్ని తప్పుబట్టారు. మాజీ సీఎం హోదాలో ఉన్న జగన్‌కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. దీనిపై గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. జగన్‌కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం అయిందని ఫిర్యాదు చేశారు. ఇక నుంచైనా జగన్‌కు పటిష్ట భద్రత కల్పించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
మాజీ సీఎం జగన్ భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని..మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గుంటూరు పర్యటనలో ఆయనకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. జగన్ భద్రతపై తమకు ఆందోళన ఉందన్నారు. తమ ఆందోళనను గవర్నర్‌కు తెలియజేశామని చెప్పారు. జగన్‌కు రక్షణ కల్పించాలని కోరినట్లు తెలిపామన్నారు. తమ ఫిర్యాదుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు.
జగన్ భద్రతా వ్యవహారంపై మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పందించారు. ఈ విషయంలో చంద్రబాబు తన వక్ర బుద్దిని బయట పెడుతున్నారని మండిపడ్డారాయన. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము భద్రత ఇవ్వకపోయి ఉంటే..ఆయన కనీసం బయట తిరిగే వారు కాదన్నారు. జెడ్ ఫ్లస్ కేటగిరి ఉన్న ప్రతిపక్ష నేతకి భద్రత కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలం అయ్యిందని విమర్శించారు. జగన్ అధికారంలో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్నా ఆయన క్రేజ్ తగ్గదన్నారు.
వైసీపీ నేతల వ్యాఖ్యలకు కూటమి మంత్రులు తమదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. భద్రత విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి డ్రామాలు చేస్తున్నారని..మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఆరోపించారు. ఎన్నికల కోడ్ ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని జిల్లా కలెక్టర్ చెప్పినా జగన్ ధిక్కరించి మరీ గుంటూరు వెళ్లారన్నారు మంత్రి. వైసీపీ అధినేతకు భద్రత కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యం ఏమీ లేదన్నారు.
జగన్‌కు ఏం భద్రత తగ్గిందని వైసీపీ నేతలు గవర్నర్‌ను కలిశారని గొట్టిపాటి రవికుమార్ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్‌కు ఎలాంటి భద్రత తగ్గించలేదన్నారు. ముఖ్యమంత్రి పని చేసిన జగన్‌కు ఎన్నికల కోడ్ ఉల్లంఘించకూడదన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. ఏపీ ప్రజలు 11 సీట్లు ఇచ్చినా జగన్ బుద్ది మారలేదని వ్యాఖ్యానించారు.
రైతన్నల గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్‌కి లేదని మంత్రి సవిత విమర్శించారు. రెండు రోజులు ఏపీకి వచ్చి అల్లర్లు సృష్టించి తిరిగి బెంగళూరు వెళ్లి పబ్జీ ఆడుకుంటారని ఎద్దేవా చేశారు. వైసీపీ ఉనికిని కాపాడేందుకే జగన్ డ్రామాలాడుతున్నారని సవిత మండిపడ్డారు. ఎన్నికల నియమావళి గురించి పులివెందుల ఎమ్మెల్యేకి తెలియదా అని ప్రశ్నించారు ఆమె.
ఇదిలా ఉంటే మరోవైపు జగన్‌పై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కోడ్ అమల్లో ఉందని, ఈ నిబంధనను జగన్ ఉల్లంఘించారంటూ జగన్‌తో పాటు పలువురిపైనా కేసులు నమోదు చేశారు. దీంతో పోలీసుల తీరుపైనా వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం శాశ్వతం కాదని హెచ్చరించారు.