తెలంగాణ విశ్వ విద్యాలయాలు సమస్యల వలయంలో కొట్టు మిట్టాడుతున్నాయి. నిధుల కొరత, అరకొరగా ఉన్న అధ్యాపకులు, ఇంచార్జ్ వీసీలతో కాలక్షేపం. ఇలా ఎన్నో ఇక్కట్లతో విశ్వవిద్యాలయాలు కొట్టుమిట్టాడుతున్నాయి. వర్సిటీల్లో దాదాపు మూడు వేలకు పైగా టీచింగ్ పోస్ట్ లు భర్తీచేయాల్సి ఉంది. మహిళా వర్సిటీ ప్రకటించినా అసెంబ్లీలో గత ప్రభుత్వం బిల్లు పెట్టక పోవడంతో ఆ వర్సిటీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి మాదిరిగానే ఉంది. వర్సిటీ సర్చ్ కమిటీలు ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. ఈ పరిస్థితుల్లో వీసీల నియామకానికి మరింత సమయం పట్టేలా ఉంది.
రాష్ట్రంలో వర్సిటీల పరిస్థితి దయనీయంగా ఉంది. విశ్వ విద్యాలయాల పూర్తి స్థాయి వైస్ ఛాన్సలర్ల నియామకాల ప్రక్రియ ఎప్పుడు జరుగుతుందో తెలియడం లేదు. వర్శిటీ వీసీల నియామకానికి సంబం ధించి సర్చ్ కమిటీలు వేసినా, సమావేశాలు, సెలక్షన్ ప్రక్రియ మొదలు కాలేదు. దీంతో, ఇంచార్జీ వీసీలే కొనసాగనున్నారు. ఇదిలా ఉండగా యూనివ ర్శిటీలో ప్రొఫెసర్ల ఖాళీల భర్తీ ఏళ్ల తరబడి పెండింగ్ ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. నిధుల సమస్య, ప్రొఫెసర్లు నియామకాల సందిగ్ధం. ఈ కారణాలతో విశ్వ విద్యాలయాలు అభివృద్ధి కి ఆమడ దూరంలో ఉంటున్నాయి. గత నెల 21 తో వీసీల పదవీ కాలం పూర్తి అయ్యింది. దీంతో, రాష్ట్ర ప్రభుత్వం కొత్త వీసి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వర్సిటీల్లోని పది వీసీ పోస్టులకు 1382 అప్లికేషన్లు రాగా 312 మంది సీనియర్ ప్రొఫెసర్లు వీసి పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. దీంట్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కి ఎక్కువగా 208 మంది అప్లై చేయగా JNTU ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటికి చాలా తక్కువగా అప్లికేషన్లు వచ్చాయి. రాష్ర్టంలో 12 ప్రభుత్వ యూనివర్శిటీ లు ఉండగా, పదింటికి మాత్రమే సర్కారు నోటిఫికేషన్ ఇచ్చింది. బాసర ట్రిపుల్ ఐటీ, మహిళా యూనివర్శిటీ వీసీ పోస్టులను ప్రభుత్వం నోటిఫికేషన్ లో చేర్చలేదు.
యూనివర్శిటీ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా వర్సిటీ ల్లో ఖాళీలు భర్తీ చేయాలని గత ప్రభుత్వం భావించింది. అయితే, అప్పట్లో అది ముందుకు సాగలేదు. కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లును గవర్నర్, రాష్ట్రపతి పరిశీలనకు పంపడం, ఎన్నికలు రావడం, కొత్త ప్రభుత్వం ఏర్పడడం ఈ కారణాలతో ఖాళీల భర్తీ పై క్లారిటీ లేకుండాపోయింది. ప్రతిష్ఠాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో 890 , JNTUH 241, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో 96 పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీలో 58 ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 3 వేలకు పైగా ఖాళీలను భర్తీ చేయాల్సింది. ఇంచార్జ్ వీసీలు వర్సిటీ అభివృద్ధిపై దృష్టి సారించలేకపోతున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయా లతో సంబంధం లేకుండా వీసీ నియామకాలు జరగాల్సి ఉంది. అయితే, కొందరు ప్రొఫెసర్లు పైరవీలకు పాల్పడి పోస్టులు సంపాదించాలని చూస్తున్నారని, ఇది దురదృష్టకరమని విద్యార్థి సంఘాల నేతలు అంటున్నారు. ఉన్నత స్థాయి చదువులకు విశ్వవిద్యాలయాలే తొలి మెట్టు. గత సర్కారు హయాంలో వర్సిటీలు నిర్లక్ష్యానికి గురయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. గతం గతః అంటారు పెద్దలు. అందుకే గత విషయాలు పక్కనపెట్టి ప్రస్తుత పాలకులు వర్సిటీ అభివృద్ధి పై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. A++ న్యాక్ గ్రేడులతో , పూర్తి స్థాయి ఫ్యాకల్టీతో, ప్లేస్ మెంట్లతో విశ్వ విద్యాలయాలు ముందుకు వెళ్లాలని, అప్పుడు భావితర విద్యార్థులకు భరోసా ఉంటుందని విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు.