అసలు ఓయూలో ఏం జరిగింది?

ఉస్మానియా యూనివర్సిటీ సెలవుల వ్యవహారం రాజకీయ రగడకు దారి తీసింది. కరెంట్, నీటి కొరత అంశంతో పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రస్ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ పొలిటికల్‌ గేమ్‌తో అంతకంతకు వేడి రాజుకుంటోంది. అసలు ఉస్మానియా యూనివర్సిటీలో ఏం జరిగింది..? ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజమెంత..?

తెలంగాణలో కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ ఎపిసోడ్‌ కంటిన్యూ అవుతోంది. పార్లమెంట్‌ ఎన్నికల వేళ ఈ వేడి సమ్మర్‌ను మించి హీట్ పుట్టిస్తోంది. ఇక అధికారం హోదా నుంచి ప్రతిపక్ష స్థాయికి పడిపోయిన గులాబీ శ్రేణులు.. ఎన్నికల వేళ రేవంత్‌ ఎక్కడ దొరుకుతారా అని కాచుకుని కూర్చుకున్నారు. గులాబీ నేతల ఎత్తుగడలకు నీటి కొరత, కరెంట్‌ సమస్యలు తోడవుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి.. సాగు నీరు అందక అన్నదాత అవస్థ పడుతుంటే.. వారికి భరోసా ఇస్తూ పోరుబాట పట్టారు కేసీఆర్‌. మొన్నటి వరకూ కాంగ్రెస్‌ తెచ్చిన కరువంటూ రేవంత్‌ సర్కార్‌పై ధ్వజమెత్తిన గులాబీ బాస్‌కు ఇప్పుడు ఉస్మానియా సెలవుల వ్యవహారం చిక్కింది. తాగు నీరు, క‌రెంట్ కొర‌తతో అల్లాడుతున్నామని విద్యార్థులు నిరసన చేయడంతో కేసీఆర్‌ అదే అంశాన్ని మరో అస్త్రంగా మార్చుకున్నారు. ట్విట్టర్‌ వేదికగా కాంగ్రెస్‌ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్ద‌డి, క‌రెంట్ కోత ఉంద‌న‌డానికి ఉస్మానియా యూనివ‌ర్సిటీలో నెల‌కొన్న ప‌రిస్థితులే కార‌ణ‌మ‌ని మండిపడ్డారు. బస్సుయాత్రతో బిజీగా ఉన్న కేసీఆర్.. ఇప్పటికే రేవంత్‌ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. తమ పదేళ్ల పాలనలో కరెంట్‌ కష్టాలు లేవని.. తాగు, సాగు నీరు అందించామని.. కాంగ్రెస్‌ వచ్చి 5 నెలలైనా కాకుండానే కరెంట్ కష్టాలు, కరువు తాండవం చేస్తున్నాయని దుమ్మెత్తిపోస్తున్నారు. 

ఇక కేసీఆర్‌ చేస్తున్న ఆరోపణలకు ట్విట్టర్‌ వేదికగా కౌంటర్‌ ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. కేసీఆర్‌ను చూస్తే గోబెల్స్‌ మళ్లీ పుట్టాడనిపిస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్‌నగర్‌లో, ఇవాళ ఉస్మానియా యూనిర్సిటీకి సంబంధించి తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి శాయశక్తుల ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2023 మే లో కూడా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ వేసవి సెలవులకు సంబంధించి, నెల రోజుల పాటు హాస్టళ్లు, మెస్‌లు మూసివేయడం గురించి ఇలాంటి నోటీసునే జారీ చేశారని.. అందులో కూడా విద్యుత్, నీటి కొరతల గురించి ప్రస్తావించారని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసేస్తున్నట్టు దిక్కుమాలిన దివాళా కోరు ప్రచారం చేయడం కేసీఆర్ దిగజారుడుతనానికి పరాకాష్ట అని మండిప‌డ్డారు. అలాగే,.. విద్యార్థి సంఘాల నేత, ఎమ్మెల్సీ బల్మూరి కూడా కేసీఆర్‌ ఆరోపణలపై ఫైర్‌ అయ్యారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపిన బల్మూరి.. బీఆర్‌ఎస్‌ నేతలకు సవాల్‌ విసిరారు. వర్సిటీలో రెండ్రోజులపాటు బస చేసి వారికి అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకుని మాట్లాడాలని మండిపడ్డారు

ఇక సీఎం రేవంత్ చేసిన ట్వీట్‌కు… అదే ట్విట్టర్‌ వేదికగా కౌంటర్‌ ఎటాక్‌ చేశారు గులాబీ శ్రేణులు. గుంపు మేస్త్రి గోబెల్స్ గురించి మాట్లాడటం.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమ‌ర్శించింది. ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఒక సోషల్ మీడియా ట్రోల్ లాగా ఫేక్ సర్క్యూలర్ పోస్ట్ చేయడానికి కొంచెమైనా సిగ్గుండాలంటూ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. విద్యార్థులకు కనీసం నీళ్లు, కరెంట్ ఇవ్వడం చేతకాని దద్దమ్మ అంటూ రాసుకొచ్చారు. నీ ఫేక్ ముచ్చట్లు ఓయూలో నీళ్లు, కరెంట్ కోసం ధర్నా చేస్తున్న విద్యార్థులకు చెప్పు.. నిన్ను ఉరికిస్తరంటూ సెటారికల్‌ కామెంట్స్‌ చేశారు. మీ హామీలు ఫేక్, మీ పాలన ఫేక్, మీ మాటలు ఫేక్.. చివరికి మీ సోషల్ మీడియా పోస్టులు కూడా ఫేక్. ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి 6 నెలలు కూడా కాలే… అప్పుడే సోషల్ మీడియాలో ఫేక్ సర్క్యూలర్స్ పోస్ట్ చేసే స్థాయికి దిగజారావంటే.. ఎంత అభద్ర‌తాభావంతో బ‌తుకుతున్నావో అర్థమవుతుంది. బుకాయించి, దబాయించి పాలన సాగిద్దాం అనుకుంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు ఖబడ్దార్ అంటూ హెచ్చరిం చారు. ఇక ఇదే అంశంపై బీఆర్ఎస్‌ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ఫైర్‌ అయ్యారు. కేసీఆర్‌ స్పందించగానే కరెంట్‌, నీళ్లు ఉన్నాయంటూ చీఫ్‌ వార్డెన్‌కు నోటీసులిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే భట్టి స్టేట్‌మెంట్‌పై కూడా విమర్శించారు. చిన్న అధికారిని బలి చేసి చేతులు దులుపుకుని రాక్షస ఆనందం పొందుతామంటే చూస్తూ ఊరుకోమని వార్నింగ్‌ ఇచ్చారు.

ఇక ఉస్మానియా చీఫ్‌ వార్డెన్‌ ఇచ్చిన నోటీస్‌తోనే ఈ రాజకీయ దుమారం చెలరేగింది. ఉస్మానియాలో కరెంటు కోతలు, నీటి ఎద్దడి ఎదురవుతోందని.. దయచేసి హాస్టల్స్‌ ఖాళీ చేసేయండంటూ ఓయూ చీఫ్‌ వార్డెన్‌ విద్యార్థులకు నోటీసులు ఇచ్చారు. దీంతో వర్సిటీ స్టూడెంట్స్‌ అంతా ధర్నాకు దిగారు. తాము కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నామని.. తమను ప్రభుత్వం పట్టించుకోవాలంటూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం వార్డన్‌కు నోటీసులు జారీ చేసింది. విద్యార్థులు ఎక్కడకు వెళ్లక్కర్లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం అసలు రాష్ట్రంలో కరెంటు కోతల్లేవని తెలిపారు. వాస్తవాలు ధ్రువీకరించుకోకుండా తప్పుడు ప్రకటన చేసినందుకు వార్డెన్‌కు షోకాజ్‌ నోటీసులు ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. మరి ఉస్మానియాలో కరెంట్‌ కష్టాలు, నీళ్ల కొరత ఉందని చెబుతున్న బీఆర్‌ఎస్‌ ఆరోపణలు నిజమా..? లేదంటే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేవని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్న మాటలు వాస్తవమా..? ఇవే ప్రశ్నలు ప్రస్తుతం పొలిటికల్‌ వర్గాల్లోనే కాదు.. ఇటు రాష్ట్ర ప్రజల్లోనూ చర్చకు దారితీశాయి.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్