పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో తెలుగు ప్రజల ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.లోక్సభ ఎన్నికల నేపథ్యం లో తెలుగు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కర్ణాటకలోని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను తెలుగు ఓటర్లే నిర్ణయిస్తారు. ఆ సంఖ్యలో తెలుగు ఓటర్లు ఉన్నారు. దీంతో తెలుగు ఓటర్లను ఆకట్టుకోవడానికి వివిధ పార్టీలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల నుంచి తెలుగు ప్రముఖులను రప్పించడం, వారితో ప్రచారం చేయించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లోనూ అదే ట్రెండ్ కొనసాగుతోంది.
2019 లోక్సభ ఎన్నికలను పరిశీలిస్తే, కర్ణాటకలోని చామరాజనగర్ , కొప్పళ్ల, తుములూరు లోక్సభ నియోజకవర్గాల్లో విజేతలకు 50వేల లోపు మెజారిటీ వచ్చింది. ఈ మూడు నియోజకవర్గాల్లో రెండిటిలో తెలుగు ఓటర్ల ప్రభావం ఎక్కువ. అలాగే బళ్లారి, బెంగళూరు సెంట్రల్, చిత్రదుర్గ, కలబురగిలలో 50 వేల నుంచి లక్ష లోపు ఆధిక్యంతో గెలిచారు. వీటిలో మూడు నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్ల జనాభా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు లక్ష నుంచి రెండు లక్షల లోపు ఆధిక్యం ఉన్న స్థానాల్లోనూ తెలుగు ఓటర్ల ప్రభావం ఎక్కువ. అలాగే కర్ణాటక వ్యాప్తంగా కొద్దిపాటి ఆధిక్యాలు నమోదయ్యే నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లు నిర్ణయాత్మకంగా మారడం ప్రతి ఎన్నికల్లోనూ గమనించవచ్చు. ఈ నేపథ్యంలో తెలుగు ఓటర్లను ఆకట్టుకోవడానికి వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఇక్కడి రాజకీయ పార్టీలకు ఆనవాయితీగా వస్తోంది. కాగా కిందటేడాది మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు వేలలోపు ఓట్లతో అభ్యర్థులు ఓడటం, గెలవటం వెనుక తెలుగు ఓటర్ల ప్రభావం ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
కర్ణాటకలో స్థిరపడ్డ తెలుగువారు గతంలో తమతమ వ్యాపారాలు, ఉద్యోగాలకే పరిమితమయ్యేవారు. అయితే గత ఐదేళ్లుగా కన్నడనాట స్థిరపడిన తెలుగు ఓటర్లు స్థానిక రాజకీయాలపై ఆసక్తి చూపుతు న్నారు. కన్నడనాట సెటిలైన తెలుగు ప్రజలంతా ఐటీ ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల కోసం వచ్చిన వారే. జాతీయ రాజకీయాల్లో చోటు చేసుకునే సమీకరణాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అందుకు తగ్గట్టుగా స్పందిస్తుంటారు. బెంగళూరులో స్థిరపడిన ఐటీ ఉద్యోగులు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాజకీయ పోకడలను గమనిస్తుంటారు. ప్రధానంగా కోలారు, తుముకూరు, బీదర్, బళ్లారి, రాయచూర్, చిత్రదుర్గ, కొప్పళ, బీదర్ ప్రాంతాల్లోని తెలుగువారు స్థానిక రాజకీయాలతో మమేకమై ఉంటారు. గత ఐదేళ్లలో బెంగళూరుకు వచ్చి స్థిరపడినవారి సంఖ్య అనధికారికంగా 30 లక్షలకు పైగా ఉందని సమాచారం.
మొత్తంగా కర్ణాటక జనాభాలో కనీసం కోటి మంది తెలుగు వారు ఉన్నారన్నది ఒక అంచనా. కిందటేడాది సెప్టెంబరులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టయిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా వేలాదిమంది తెలుగు ప్రజలు బెంగళూరు, బళ్లారి, రాయచూర్, కోలారు తదితర ప్రాంతాల్లో ఆందోళన చేపట్టారు. వీరంతా ఇప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా రాజకీయ అంశాలపై సందేశాలు, ప్రచారాలు చేస్తూ తెలుగు ఓటర్లను చైతన్య పరుస్తున్నారు. అంతేకాదు కర్ణాటకలో జరుగతున్న లోక్సభ ఎన్నికల్లో తెలుగువారే కీలకంగా మారారు.


