కల్పన కేసులో ట్విస్ట్.. భర్తపై అనుమానాలు
సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. గత రెండు రోజులుగా కల్పన భర్త ఇంట్లో లేరని చెబుతున్నారు. రెండు రోజులుగా కల్పన మాత్రం తన ఇంట్లోనే ఉన్నారు. ఇంటి నుంచి ఎక్కడికీ వెళ్లలేదట. చెన్నై నుంచి కల్పన భర్త ప్రసాద్ ఆస్పత్రికి చేరుకున్నారు. భర్త మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. పోలీసులు కల్పన భర్తను తీసుకుని ఇంటికి వెళ్లారు. కల్పన ఇంట్లో మరోసారి తనిఖీలు చేస్తున్నారు. రెండు రోజులుగా తాను బయటకు వెళ్లానని కల్పన భర్త పోలీసులకు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే గాయని కల్పన ఆమెకు భర్త లేడని.. 2010లో వివాహ బంధం ముగిసినట్టు ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
నిజాం పేట్ వర్టెక్స్ ప్రీ విలేజ్ లో ఓ విల్లాలో ఆమె నివాసం ఉంటున్నారు. మొన్న శివరాత్రి ఉత్సవాల్లో సింగర్ మనోతో కలిసి ఓ ఈవెంట్ లో పాటలు పాడి చాలా ఉత్సాహంగా కనిపించారు.
ప్రస్తుతం కల్పను కేపీహెచ్ బీలోని హోలిస్టిక్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నదని పోలీసులు చెప్పారు. పలువురు గాయనీ గాయకులు ఆస్పత్రికి చేరుకుని ఆమె ఆరోగ్యంపై ఆరా తీశారు. సునీత, శ్రీకృష్ణ, కారుణ్య, గీతా మాధురి తదితరులు ఆస్పత్రికి చేరుకుని ఆమె ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అసలేం జరిగింది..
ప్రముఖ సినీ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ కల్పన ఆత్మహత్యాయత్నం చేశారు. కల్పన నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి యత్నించారు. కల్పన హైదరాబాదులోని నిజాంపేటలో నివసిస్తున్నారు. ఆమె నిద్రమాత్రలు మింగి తన ఫ్లాట్ లో అపస్మారక స్థితిలో ఉన్నట్టు సమాచారం అందుకున్న కేపీహెచ్ బీ పోలీసులు వెంటనే స్పందించారు. కల్పన ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఆమెను కాపాడారు. కల్పన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆత్మహత్యకు యత్నించడానికి గల కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది.
కాగా, ఓ ఇంటర్వ్యూలో తాను గతంలో కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు కల్పన వెల్లడించారు. తాజాగా, కల్పన తలుపు తీయకపోవడంతో ఇరుగుపొరుగు వారు… చెన్నైలో ఉన్న ఆమె భర్త ప్రసాద్ కు ఫోన్ చేయడంతో, అతడు చెన్నై నుంచి బయల్దేరి హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది. ఆమె భర్త ప్రసాద్ ను పోలీసులు విచారిస్తున్నారు.