26.2 C
Hyderabad
Saturday, September 30, 2023

బీఆర్‌ఎస్ ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ పేరు ఖరారు?

– జనసేనకు తోట చంద్రశేఖర్ గుడ్‌బై
– నేడు కేసీఆర్ సమక్షంలో చేరిక?
– కాపు ఓట్ల కోణంలో తోట నియామకం?
– తోటతో బీఆర్‌ఎస్‌కు ఉపయోగమెంత?
– తోట నిష్క్రమణతో నష్టం లేదంటున్న జనసేన
– హైటెక్‌సిటీ భూముల పరిష్కారం కోసమే వెళ్లారంటున్న జనసేన వర్గాలు
– తోట దారిలో రావెల, పార్ధసారథి ?
– ఆ ముగ్గురితో కేసీఆర్ ఐదుగంటల సుదీర్ఘ భేటీ
– తోట భూ వివాదంపై కేసీఆర్ హామీ?
– హైదరాబాద్‌లో రియల్‌ఎస్టేట్, ఆస్తులున్న ఏపీ వ్యాపారులపై బీఆర్‌ఎస్ గురి?
– మరికొందరు రాజకీయ నిరుద్యోగులు బీఆర్‌ఎస్‌లో చేరిక?

( మార్తి సుబ్రహ్మణ్యం)

జనసేన సీనియర్ నేత తోట చంద్రశేఖర్‌కు.. బీఆర్‌ఎస్ ఏపీ పగ్గాలు అప్పగించేందుకు తెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఆమేరకు సోమవారం తోట చంద్రశేఖర్ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో కారు ఎక్కనున్నారు. తోటతో పాటు మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వియ్యంకుడయిన మాజీ ఐఆర్‌ఎస్ అధికారి చింతల పార్ధసారథి కూడా, కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతుండటం ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా అనంతపురం జిల్లా బలిజ నేత టీజే ప్రకాష్ కూడా బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఆ మేరకు తోట , రావెల , పార్ధసారథి తో కేసీఆర్ దాదాపు ఐదుగంటలు సుదీర్ఘంగా చర్చించినట్లు పార్టీ వర్గాల సమాచారం.

కాపు వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్… గతంలో ప్రజారాజ్యం పార్టీ ఏలూరు ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి, ఓడిపోయారు. ఆ తర్వాత జనసేనలో చేరారు. అయినప్పటికీ పార్టీలో ఆయన, చురుకైన పాత్ర పోషించిన దాఖలాలు లేవు. పేరుకు గుంటూరు వాసి అయినప్పటికీ, ఆయన ఉండేది ఎక్కువ హైదరాబాద్‌లోనే కావడంతో, తోటకు గుంటూరు నగరంలోనే సంబంధాలు తక్కువ.

అయితే కాపు సామాజికవర్గానికి చెందిన నేత కావడం వల్ల, ఆయన నియామకం వల్ల.. కాపులు పార్టీవైపు పెద్ద సంఖ్యలో ఆకర్షితులవుతారన్నది, బీఆర్‌ఎస్ అంచనాగా కనిపిస్తోంది. కానీ తోటకు కాపువర్గంలో పట్టు లేదన్నది, కాపువర్గ నేతల విశ్లేషణ. కాపు సంఘాలతో కూడా ఆయనకు, సన్నిహిత సంబంధాలు లేవంటున్నారు. హైదరాబాద్‌లో అప్పుడప్పుడు నిర్వహించే కాపు నేతల సమావేశాల్లో మాత్రమే, తోట కనిపిస్తుంటారని కాపు నేతలు చెబుతున్నారు.

జిల్లా స్థాయి కాపు నేతలకు ఉన్న సంబంధాలు కూడా, తోటకు కాపు వర్గంతో లేవని స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా తోట చంద్రశేఖర్‌ను చూసి కాపు వర్గం బీఆర్‌ఎస్ వైపు మొగ్గే అవకాశాలు ఏమాత్రం లేవన్నది కాపు నేతల విశ్లేషణ. తాను కాపు వర్గ నేతగా ఆయన ప్రచారం చేసుకోవడం తప్ప, ఏపీ కాపుల్లో ఆయనకు ఉన్న గుర్తింపు బహు తక్కువంటున్నారు. మరి ఏ కోణంలో తోటకు, బీఆర్‌ఎస్ పగ్గాలు అప్పగిస్తున్నారో తమకు అర్ధం కావడం లేదని, కాపు సంఘ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

కాగా తోట చంద్రశేఖర్… హైదరాబాద్‌లో భవన నిర్మాణ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. ఆ క్రమంలో హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్ వద్ద, 8 ఎకరాల భూమి చాలా ఏళ్ల నుంచి వివాదంలో ఉందని, జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఆ భూమికి సంబంధించి.. వైసీపీలో ఉన్న కాకినాడ యువనేతకు చెందిన కంపెనీతో, తోట కంపెనీకి చాలాకాలం నుంచి వివాదం ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన ఆ కంపెనీతో, తోట కంపెనీకి చాలాకాలం నుంచీ వివాదం కొనసాగుతోందని జనసేన నేత ఒకరు వెల్లడించారు.

ఆ భూమికి చెందిన సమస్య పరిష్కారం కోసమే, ఆయన బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్న సమాచారం తమ దగ్గరుందని, జనసేన నేత ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం నలుగురితో పెనవేసుకున్న ఆ వివాదం ఉన్న ఆ భూమి సమస్యను, రాజీ మార్గం ద్వారా పరిష్కరిస్తానని బీఆర్‌ఎస్ నాయకత్వం, ఆ మేరకు హామీ ఇచ్చిందన్నది జనసేన వర్గాల కథనం. కాగా ఆ భూమి వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని సమాచారం. ఈ క్రమంలో తోట పార్టీ నుంచి వెళ్లిపోతే.. తమకు వచ్చిన నష్టమేమీలేదని, జనసేన సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. తోట జనసేనలో ఉన్నప్పటికీ, ఏనాడూ క్రియాశీలకంగా పనిచేసిన దాఖలాలు లేవని స్పష్టం చేస్తున్నారు.

ఇక చాలాకాలం క్రితమే బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి, రావెల కిశోర్‌బాబు కూడా, బీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఆయనకు ఢిల్లీలో పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. రావెల తన సొంత సమస్యలతోనే బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తె లుస్తోంది.

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వియ్యంకుడయిన మాజీ ఐఆర్‌ఎస్ అధికారి పార్ధసారథి కూడా, కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనుండటం బీజేపీ వర్గాలను విస్మయపరుస్తోంది. ఆయనకూ హైదరాబాద్‌లో, వ్యాపారాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్ధసారథి గత ఎన్నికల్లో అనకాపల్లి జనసేన ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేశారు.

ఇదిలాఉండగా.. ఏపీలో బీఆర్‌ఎస్ విస్తరణ నేపథ్యంలో.. మరికొందరు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, రియల్టర్లు ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రముఖులు, భూవివాదాల్లో చిక్కుకున్న మరికొందరు వ్యక్తులు.. బీఆర్‌ఎస్‌లో చేరడం ద్వారా, తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు బీఆర్‌ఎస్ నాయకత్వం నుంచి వారికి స్పష్టమైన హామీ లభించిందంటున్నారు.

అందులో భాగంగా.. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, భవన నిర్మాణరంగంలో ఉన్న.. కృష్ణా, పశ్చిమ గోదావరి, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన వ్యాపారస్తులు- పారిశ్రామికవేత్తలు కూడా, త్వరలో బీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇక అటు వైసీపీ-ఇటు టీడీపీలో అవకాశాలు లేని… రాజకీయ నిరుద్యోగులు కూడా, బీఆర్‌ఎస్ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఎలాగూ ఏపీ నేతలు- వ్యాపారవేత్తలకు, హైదరాబాద్‌లో స్థిర నివాసాలు- వ్యాపారాలు ఉన్నందున, బీఆర్‌ఎస్‌లో చేరితే ఉభయతారకంగా ఉంటుందని భావిస్తున్నారు.

ఇదిలాఉండగా.. తోట చంద్రశేఖర్, పార్ధసారథి, రావెల కిశోర్‌బాబుతో, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఐదుగంటలకు పైగా సమావేశం అయినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఆ సందర్భంగా ఆ ముగ్గురు, తాము ఎదుర్కొంటున్న వ్యాపార-వ్యక్తిగత సమస్యలను, కేసీఆర్‌తో చర్చించినట్లు పార్టీ వర్గాల కథనం. అన్నీ సావధానంగా విన్న కేసీఆర్, వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దానితో సోమవారం, ఆ ముగ్గురి చేరిక ఖాయమయిందంటున్నారు.

Latest Articles

మలయాళ ఇండస్ట్రీలోకి ‘లైకా’ ఎంట్రీ!

మ‌ల‌యాళ సినిమా ఇండ‌స్ట్రీ అంటే కొత్త క‌థాంశాల‌తో సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ సినీ ప్రేక్ష‌కుల‌ను మెపిస్తూ, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంటూ ముందుకు సాగిపోతుంది. కొన్నేళ్లుగా ఓ ప‌రిప‌క్వ‌త‌, గాఢ‌మైన సినిమాల‌ను చేయ‌టంలో వీరు త‌మదైన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
290FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్