అతను ఒక స్ఫూర్తివంతమైన క్రీడాకారుడు. ఎన్నో కష్టాలు పడి హాకీ క్రీడలో జాతీయ జట్టులో స్థానం సంపాదించి, దేశానికి పేరు తెచ్చిన క్రీడాకారుడు. తనకి అక్కడ ఉన్న సమస్యలన్నీ తెలుసు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వెళ్లి, ఎకాఎకిన క్రీడా మంత్రి అయితే అతను చేయాల్సిన పనేమిటంటే, తను ఎదుర్కొన్న సమస్యలు, తన తర్వాతి తరం ఎదుర్కోకుండా చూసి మార్గదర్శనం చేయాలి. ఆదర్శంతమైన నాయకుడిగా ఉండాలి. కానీ మనవాడేం చేశాడంటే…మీరే చూడండి
అతను హరియాణా క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్, ప్రస్తుతం పీకల్లోతు వివాదాల్లో చిక్కుకుపోయాడు. చివరకు మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో ఈ వివాదానికి తెరపడిందని భావిస్తున్నారు.

హరియాణా క్రీడల మంత్రి సందీప్ సింగ్ వ్యక్తిగతంగా క్రీడాకారుడు. హాకీ ప్లేయర్ గా,కెప్టెన్ గా వ్యవహరించారు. ఆయన మీద గతంలో సూర్మా పేరుతో బయో పిక్ కూడా వచ్చింది. తర్వాత కాలంలో రాజకీయాల్లోకి అడుగు పెట్టాక మంత్రి పదవి చేపట్టారు. అయితే, కొంత మంది మహిళా ఆఫీసర్స్ ను వేధిస్తున్నారని ఆయన మీద ఆరోపణలు వెల్లువెత్తాయి.
సంతోష పెడితేనే మంచి పోస్టింగ్ ఇస్తామని, లేదంటే ట్రాన్స్ ఫర్ ల మీద ట్రాన్స్ ఫర్ లు ఉంటాయని బెదిరిస్తున్నారని ప్రచారంలో ఉంది. తాజాగా ఒక జూనియర్ అథ్లెట్ కోచ్… ఈ ఇబ్బందులు భరించలేక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోవటంతో ముఖ్యమంత్రి, గవర్నర్ లకు ఫిర్యాదు చేశారు. దాంతో పాటు మీడియా ముందుకు వచ్చి… ఈ కీచకుడి బండారం మొత్తం బయట పెట్టేశారు.
దీంతో సందీప్ సింగ్ బాధితులు వరుసగా బయటకు వచ్చారు. దీంతో ప్రభుత్వం లో పెద్ద ఎత్తున అలజడి చోటు చేసుకొంది. సందీప్ సింగ్ అరాచకాల మీద ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన ప్రభుత్వం… సందీప్ కు వార్నింగ్ ఇచ్చేసింది. దీంతో సందీప్ సింగ్ రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయారు.