స్వతంత్ర వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే రాష్ట్రపతి చేతుల మీదుగా జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం ద్వారా లోక్‌సభ సెక్రటేరియట్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లు గురువారం అవుతుందంటూ జయ సుఖిన్ అనే న్యాయవాది వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది.
పిటిషనర్ అడ్వొకేట్ జయా సుకిన్… ఆర్టికల్ 79 ప్రకారం దేశ కార్యనిర్వాహక వ్యవస్థకు రాష్ట్రపతి అధిపతిగా ఉంటారని వాదనలు వినిపించారు. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని తప్పక ఆహ్వానించాల్సిందని కోర్టుకు వివరించారు. లోక్‌సభ సెక్రెటేరియట్, కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపకుండా రాష్ట్రపతిని అవమానించాయని ఆరోపించారు. వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం… ఈ వ్యాజ్యాన్ని ఎందుకు, ఎలా దాఖలు చేశారనేది తమకు తెలుసని వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం ఇలాంటి వాటిని ప్రోత్సహించలేమని వెల్లడించింది.
పిటిషనర్ అడ్వొకేట్ జయా సుకిన్ వాదిస్తూ.. పిటిషన్ను సుప్రీంకోర్టు స్వీకరించకపోతే.. ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని కోరారు. దీనికి ప్రతివాదనలు వినిపించిన కేంద్రం తరఫు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు అనుమతించొద్దని… అలా చేస్తే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తారని విజ్ఞప్తి చేశారు.