28.2 C
Hyderabad
Saturday, July 13, 2024
spot_img

పదునెక్కిన కొత్త చట్టాలు ….. మూడేళ్ళ లోపే న్యాయం

    స్వదేశీ న్యాయం మొదలైంది. భారతదేశ నేర న్యాయవ్యవస్థలో పెనుమార్పులు తీసుకువచ్చే కొత్త నేర చట్టాలు తాజాగా అమలులోకి వచ్చాయి. దీంతో బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్  ఐపీసీ ఇక మీదట భారతీయ న్యాయ సంహితగా మారింది. అలాగే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సీఆర్‌పీసీ  భారతీయ నాగరిక్ సురక్ష సంహితగా మారింది. అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ భారతీయ సాక్ష్య అధినియమ్ గా మారింది. కిందటేడాది డిసెంబరులో సదరు చట్టాల తాలూకు బిల్లులను పార్లమెంటు ఆమోదించింది . తాజాగా ఇవి చట్టాలుగా మారాయి. అంతేకాదు వెంటనే అమల్లోకి వచ్చాయి. కొత్త చట్టాలతో దేశవ్యాప్తంగా నేర న్యాయవ్యవస్థలో అనేక కీలక మార్పులు వచ్చాయి. జీరో ఎఫ్‌ఐఆర్‌, ఫిర్యాదు లను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, ఎస్‌ఎంఎస్ వంటి ఆధునిక పద్దతుల్లో సమన్లు పంపడం, తీవ్రమైన నేరాలకు సంబంధించి క్రైమ్ సీన్లను తప్పనిసరిగా వీడియోల్లో రికార్డు చేయడం వంటి ఆధునిక పద్దతులు న్యాయవ్యవస్థలో పొందుపరిచారు. చట్టాల పేరు మాత్రమేకాదు. వాటిలో చేసిన సవరణలను సైతం పూర్తిగా భారతీయ ఆత్మతో రూపొందించామని చెబుతోంది కేంద్ర ప్రభుత్వం.

   బ్రిటిష్ కాలంనాటి నేరవ్యవస్థకు సంబంధించిన చట్టాలు ఆధునిక భారతదేశ అవసరాలను తీర్చలేక పోతున్నాయన్నది కేంద్రప్రభుత్వ వాదన. ఈ చట్టాలను కాలానుగుణంగా మార్చాలన్నది కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం. దీంతో 2020లో క్రిమినల్ చట్టాల సంస్కరణల సంఘాన్ని నెలకొల్పారు. సదరు సంఘం చేసిన సిఫార్సులపై బ్రిటిష్ కాలంనాటి పాత చట్టాల స్థానంలో కొత్తవాటిని రూపొందించారు. 21వ శతాబ్ది అవసరాలకు అనుగుణంగా భారత న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత పేరుతో కొత్త చట్టాలు తాజాగా అమల్లోకి వచ్చాయి. వలస పాలనా యుగంలో ఈస్టిండి యా కంపెనీ భారతదేశంలో న్యాయవ్యవస్థను సమూలంగా మార్చేసింది. బ్రిటిష్ తరహా కోర్టులను, హైకోర్టును నెలకొల్పింది. అంతేకాదు 1860 నుంచి వివిధ శిక్ష్మాస్మృతులు అమలులోకి వచ్చాయి. ఈ శిక్ష్మాస్మృతులపై అనేక విమర్శలు వచ్చాయి. నేరస్తులను శిక్షించి, పౌరులను రక్షించాల్సిన సదరు చట్టాలు సామాన్యులను వేధించడానికి ఉపయోగపడుతున్నాయన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యం లో పాత చట్టాలను మార్చివేశారు. ఇందుకు చాలా కారణాలున్నాయి బ్రిటీష్ పాలన నాటి చట్టాలు శిక్షకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చాయన్నది ప్రధాన కారణం కాగా ప్రస్తుతం రూపొందించిన చట్టాల్లో శిక్ష కంటే న్యాయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామంటున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా.

    ఉగ్రవాదం, ఉగ్రవాద చర్యలను తొలిసారిగా నిర్వచించి, వాటిని నేర చట్టం కిందకు తీసుకువచ్చారు. ఇంతకుముందటి దేశ ద్రోహం నేరాన్ని రాజద్రోహంగా మార్పు చేశారు. కాగా నిర్లక్ష్యంతో వాహనం నడిపి మరణానికి కారణమైన నేరస్తులకు ఇప్పటివరకు రెండేళ్ల జైలు శిక్ష ఉండేది. కొత్త చట్టాల్లో ఈ శిక్షను ఐదేళ్లకు పెంచారు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలపై విచారణకు కొత్త చట్టాల్లో ప్రాధాన్యం ఇచ్చారు. వివాహం చేసుకుంటననో లేదా మరో మరో విధంగానో యువతులను మోసగించి లైంగికంగా సంబంధం పెట్టుకోవడాన్ని భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 69 ప్రకారం నేరంగా పరిగణిస్తారు. అలాగే మైనర్ పై గ్యాంగ్ రేప్ నకు పాల్పడిన వారికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధిస్తారు కొత్త చట్టాల ప్రకారం. వాస్తవానికి ఐపీసీలో కొన్ని సెక్షన్లు సంక్లిష్టంగా ఉండేవి. ఏ నేరం ఏ సెక్షన్ కిందకు వస్తుందన్న విషయంలో కాస్త గందరగోళం ఉండేది. దీంతో ప్రస్తుత చట్టాలను సరళతరం చేశారు. ఐపీసీలో గతంలో 511 సెక్షన్లు ఉండేవి. అయితే ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో ఆ సంఖ్య కేవలం 358 కి పరిమితం చేశారు. ఐపీసీలోని ఆరు నుంచి 52 సెక్షన్ల మధ్య ఉన్న పలు నిర్వచనాలను సైతం ఒక సెక్షన్ కిందకు తీసుకువ చ్చారు. అంతేకాదు 18 సెక్షన్లను పూర్తిగా రద్దు చేశారు.

   తీవ్రమైన నేరాలకు అడ్డుకట్ట వేసే విధంగా చట్టాల్లో పెనుమార్పులు చేశారు. నకిలీ నోట్ల తయారీ, వాటి స్మగ్లింగ్‌ను ఉగ్రవాదం పరిధిలోకి తీసుకువచ్చారు. విదేశాల్లో ఎవరైనా భారతీయుల ఆస్తులను ధ్వంసం చేస్తే సదరు కార్యకలాపాలను ఉగ్రవాదంగా నిర్వచించారు. అంతేకాదు డిమాండ్ల సాధనకు వ్యక్తులను బంధించడం, కిడ్నాప్ చేయడాన్ని సైతం ఉగ్రవాదం పరిధిలోకి తీసుకువచ్చారు. ఇక, మహిళలు, పిల్లలపై జరిగే నేరాల కోసం ప్రత్యేకంగా ఒక అధ్యాయాన్ని పెట్టారు. పిల్లలను అమ్మడం, కొనడాన్ని తీవ్రమైన నేరంగా మార్చారు. మైనర్‌పై గ్యాంగ్ రేప్‌నకు మరణ శిక్ష లేదంటే జీవిత ఖైదు నిబంధన తీసుకొచ్చారు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాల్లో బాధితులకు అన్ని ఆస్పత్రుల్లో ప్రథమ చికిత్స లేదంటే వైద్యం అందించాలన్న నిబంధన చేర్చారు. కొత్త చట్టాల నేపథ్యంలో మహిళలు, పదిహేనేళ్ల లోపు ఉన్న వారు, అరవై ఏళ్లు పైబడిన వ్యక్తులు, దివ్యాంగులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇంటి నుంచే పోలీసు సహాయం పొందవచ్చు. ఇక, కోర్టు అనుమతి లేకుండా లైంగిక దాడి గురించి ప్రచురిస్తే రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించే నిబంధనను కూడా చేర్చారు. తాజాగా అమల్లోకి వచ్చిన ఈ కొత్త చట్టాల ద్వారా అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఫిర్యాదుల నుంచి సమన్ల వరకు అన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. పోలీసు స్టేషన్‌కు వెళ్లే పని లేకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమన్లు పంపే వీలుంటుంది. ఇక, అన్నిటికంటే ముఖ్యంగా పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్‌లో అయినా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనినే జీరో ఎఫ్‌ఐఆర్‌ పద్దతి అంటారు.

   కోర్టుల్లో కేసులు ఒక కొలిక్కి రావడం అంటే చిన్న విషయం కాదు. సంవత్సరాలు పడతాయి. ఈ నేపథ్యంలోనే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్..అనే నానుడి పుట్టింది. దీంతో కేసుల పరిష్కారానికి సంబంధించి కొత్త చట్టాల్లో టైమ్ లైన్ ఫిక్స్ చేశారు. క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన 45 రోజుల్లోగా కచ్చితంగా తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. తొలి విచారణ జరిగిన 60 రోజుల్లోపు అభియోగాలు నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో ఒక నిర్ణీత వ్యవధిలో కేసులు పరిష్కారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి కేసులు నడిచే విధానానికి కొత్త చట్టాలు ఫుల్ స్టాప్ పెడతాయి. కొత్త చట్టాల్లో మరో విశేషం ఉంది. నేర నిరూపణకు సంబంధించి వాదనలు పూర్తయ్యాక, ముప్ఫయి రోజుల్లోగా న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు తీర్పు కాపీని వారం రోజుల్లోగా ఆన్‌లైన్లో పెట్టాల్సి ఉంటుంది. దీనివల్ల పై కోర్టుకు అప్పీల్‌కు వెళ్లడానికి వెసులుబాటు దొరుకుతుంది అంటున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. మొత్తంగా నేరం జరిగిన మూడేళ్లలోపే న్యాయం జరగాలన్నదే తమ ఉద్దేశమంటున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు.

Latest Articles

నిరుద్యోగులను కేటీఆర్‌ తప్పుదోవ పట్టిస్తున్నారు – చనగాని దయాకర్

నిరుద్యోగులను తప్పు దోవ పట్టిస్తున్న కేటీఆర్.. గన్ పార్క్ వద్ద ముక్కు నేలకు రాయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్