మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పిన్నెల్లి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పిన్నెల్లి కోసం హైదరాబాద్‌కు ఏపీ నుంచి ప్రత్యేక బృందాలు వచ్చాయి. సంగారెడ్డి జిల్లా కంది వద్ద పిన్నెల్లి వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పిన్నెల్లిపై 4 నాన్ బెయిలబుల్ సెక్షన్‌ల కింద కేసులు నమోదయ్యాయి. మరోవైపు పిన్నెల్లి విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పిన్నెల్లి సోదరుల కోసం గాలిస్తున్నాయి ఏపీ పోలీసు బృందాలు. మాచర్ల ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఏపీ సీఈవోకు నోటీసులు పంపింది. పాల్వాయి గేట్ దగ్గర ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం ఘటనపై సీఈవోను వివరణ కోరింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ ఘటనలో ఉన్నది ఎమ్మెల్యేనా అని ప్రశ్నించిన సీఈసీ ఎమ్మెల్యే అయితే కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. కేసు పెడితే ఎమ్మెల్యేని నిందితుడిగా చేర్చారా అని నిలదీసింది. నిందితుడిగా చేరిస్తే ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారా? లేదా? అని ప్రశ్నించింది సీఈసీ. కేసు పెట్టకపోతే వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.ఘటనపై సాయంత్రం 5 గంటల్లోపు నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.


