అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నాలుగు నెలలకే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరో బల పరీక్ష ఎదురుకాబోతోంది. ఖమ్మం గుమ్మంలో క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు లోక్‌సభ ఎన్నికల్లో తమ నియోజకవర్గాల్లో మెజారిటీ చూపించాల్సిన పరిస్ధితి ఏర్పడింది. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీలతో విజయభేరి మోగించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లోనూ అదే మెజారిటి చూపించాలన్న ఉద్దేశంతో వ్యూహరచన చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగనుంది. ఖమ్మం లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ నుంచి రామసహాయం రఘురాంరెడ్డి, బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు, బీజేపీ నుంచి తాండ్ర వినోద్‌రావు పోటీ పడుతున్నారు. ఇక మహబూబాబాద్ స్థానంలో కాంగ్రెస్ నుంచి పోరిక బలరాంనాయక్, బీఆర్ఎస్ నుంచి మాలోత్ కవిత, బీజేపీ నుంచి అజ్మీరా సీతారాంనాయక్ పోటీ పడుతున్నారు. అయితే ఈ రెండు స్థానాల్లో ఎమ్మెల్యేల పరంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. మరోవైపు ఈ రెండింటిలో విజయం సాధించి బోణీ కొట్టాలని బీజేపీ, సిట్టింగ్ స్థానాల్లో మళ్లీ పాగా వేయాలని బీఆర్ఎస్ ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి.
ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండగా కొత్తగూడెంలో కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందిన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా సీపీఐ ఒక్కటే కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణం చేసింది. ఇప్పుడు సీపీఎం కూడా కాంగ్రెస్‌కు జై కొట్టింది. సీపీఎం కలిసి రావడం కాంగ్రెస్‌కు అదనపు ప్రయోజనం. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో గెలుపొందిన భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉండగా ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయశాఖ మంత్రిగా, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస రెడ్డి రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రిగా ఉన్నారు. మరోవైపు మాజీ ఎంపీగా ఉన్న రేణుకాచౌదరి కూడా రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపధ్యంలో ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీని పొందాల్సిన అవసరం ఏర్పడింది.
ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల వారిగా మెజారిటీలను పరిశీలిస్తే లోక్‌సభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, సీపీఐ కూటమి ఎమ్మెల్యేలకు 7,33,293 ఓట్లు రాగా, బీఆర్‌ఎస్ అభ్యర్ధులకు 4,67,631 ఓట్లు లభించాయి. మొత్తంగా ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు 2,66,162 ఓట్ల ఆధిక్యత లభించింది. మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఇల్లెందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్‌కు 2,42,214 ఓట్లు రాగా బీఆర్‌ఎస్ కు 1,61,118 ఓట్లు లభించాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు 86,096 ఓట్లు ఆధిక్యత లభించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ మెజారిటీలను మళ్లీ రిపీట్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుస్తీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల మెజారిటీలు తగ్గితే నియోజకవర్గంలో తమ పట్టు సడులుతుందన్న అభిప్రాయం ఉండడంతో..ఎవరికి వారు బలాన్ని నిలబెట్టుకునేందుకు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ఇక్కడ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా తప్పకుండా గెలుస్తారని కాంగ్రెస్ అధిష్టానం అంచనా వేసింది. అందుకే సాంప్రదాయానికి భిన్నంగా ఖమ్మం ఎంపీ అభ్యర్థిని ఎంపిక చేసింది. ఎన్నికల మంత్రాంగంలో భాగంగా మంత్రుల కుటుంబ సభ్యులకు సీటు కేటాయించవద్దన్న వాదన ముందుకు రావడంతో.. తన వియ్యంకుడు రామసహాయం సురేందర్‌రెడ్డి పేరును పొంగులేటి తెరపైకి తెచ్చారు. రఘురామరెడ్డి తండ్రి సురేందర్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. పొంగులేటి కాంగ్రెస్ లో చేరటం వెనుక సురేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి, సురేందర్‌రెడ్డి కారణం గా ఖమ్మంలో పలు శాసనసభ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగలిగింది. ఈ సమీకరణలతో రఘురామ రెడ్డి వైపు అధిష్ఠానం మొగ్గుచూపినట్లు స్పష్టమవుతోంది. దీంతో, ఖమ్మంలో గెలుపు -మెజార్టీ పొంగులేటికి ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రలో అసెంబ్లీ ఎన్నికల పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీలు సొంతం చేసుకుంది. 2018లో 2 వేల నుంచి 10వేలలోపు ఓట్ల మెజారిటీతో మాత్రమే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవగా ఈసారి కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు అదేస్థాయిలో లోక్‌సభ ఎన్నికల్లో తమ నియోజకవర్గాల్లో పట్టు చూపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరాటపడుతున్నారు. మరి ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో వేచి చూడాలి.


