పదేళ్లలో బీజేపీ దేశ ప్రజలను దారుణంగా మోసం చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ పాలనపై కాంగ్రెస్ చార్జిషీటు విడుదల చేసింది. రెండు కోట్ల మందికి ఏటా ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ప్రధాని నిరుద్యోగులను నిలువునా ముంచారని రేవంత్ రెడ్డి విమర్శించారు. అదానీ, అంబానీ, అమెజాన్ వంటి కార్పొరేట్ సంస్థల ఒత్తిడికి బీజేపీ సర్కార్ లొంగిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రతి పేదవాడి బ్యాంక్ అకౌంట్ లోనూ 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పి మోదీ మోసం చేశారని ఆయన అన్నారు. పార్లమెంటు సాక్షిగా మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
జీఎస్టీ పేరుతో బీజేపీ దేశాన్ని దోచుకుందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఎన్డీఏ పాలనలో పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. గ్యాస్ సిలెండర్ ధరను 1200కు పెంచి మహిళలను తీవ్రం గా ఇబ్బందుల పాలు చేసారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మోదీ పాలనలో అన్ని నిత్యావసర వస్తువుల ధరలూ పెరిగిపోయాయని, ఉత్పత్తులు చేసే రైతులనూ ఎన్డీఏ సర్కార్ నిలువునా ముంచింద న్నారు. దేశ ప్రగతికి తోడ్పడే ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ హయాలో ఏర్పాటు చేస్తే, వాటన్నింటినీ కేవలం 600 కోట్ల రూపాయలకు ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు అమ్మివేశారన్నారు. దేశం మొత్తాన్ని అప్పుల ఊబిలో నెట్టేశారని ఆయన వాపోయారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎన్డీఏ సర్కార్ లో అన్యాయం జరిగిందని, రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు


