స్వతంత్ర వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయ్యింది. తమ నేత అరెస్టుని టీడీపీ శ్రేణులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న చంద్రబాబును జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా జైల్లో పెట్టిందంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వైజాగ్ ఎయిర్‌పోర్టులో ఓ టీడీపీ కార్యకర్త హల్‌చల్ చేశాడు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు ఇండిగో విమానంలో వచ్చిన అడారి కిషోర్ కుమార్ అనే టీడీపీ అభిమాని చంద్రబాబు అరెస్ట్‌పై తనదైన శైలిలో నిరసన తెలిపాడు. చంద్రబాబు అరెస్టును ఖండిద్దామంటూ పిలుపు నిచ్చాడు. సేవ్ డెమొక్రసీ అంటూ విమానంలోనూ, వైజాగ్ ఎయిర్‌పోర్టులోనూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశాడు. ఎయిర్‌పోర్టు బయట కూడా అతడు బిగ్గరగా అరుస్తుండటంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.