స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో భద్రత లేదని, ఆయన్ని హౌస్ కస్టడీలో ఉంచాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. శనివారం నంద్యాలలో అరెస్టైన చంద్రబాబు నాయుడుకు ఆదివారం ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. జైల్లోని స్నేహా బ్లాక్‌ను పూర్తిగా చంద్రబాబుకు కేటాయించారు. జైలు లోపల, వెలుపల అదనపు భద్రత కల్పించారు. చంద్రబాబుకు ఇంటి నుంచి భోజనం అందించేందుకు అనుమతించారు.
మరోవైపు జైల్లో చంద్రబాబుకు ముప్పు పొంచి ఉంటుందనే ఉద్దేశంతో హౌస్ కస్టడీ విధించాలని చంద్రబాబు తరపు లాయర్లు కోరుతున్నారు. ఈ క్రమంలో గతంలో హౌస్ కస్టడీపై కోర్టులు ఇచ్చిన కేసుల్ని ఉదహరిస్తున్నారు. సోమవారం జరిగిన విచారణలో చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్ విచారణ సందర‌్భంగా ‘నవలఖా’ కేసును సుప్రీం కోర్టు న్యాయవాది లూథ్రా ప్రస్తావించారు. చంద్రబాబుకు రాజమహేంద్రవరం జైలులో ప్రమాదం ఉందని, హౌస్ కస్టడీ విధించాలని లూథ్రా వాదించారు. మానవ హక్కుల కార్యకర్త గౌతం నవలఖాకు గతంలో సుప్రీంకోర్టు హౌస్ అరెస్టు విధించిందని ఉదహరించారు.
2017 డిసెంబరులో పూణెలో నిర్వహించిన ఎల్గార్ పరిషద్ సమావేశంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన మానవ హక్కుల కార్యకర్త గౌతం నవలఖా (70)పై కేసు నమోదైంది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అభియోగాలపై నమోదైన కేసులో 2021 ఏప్రిల్‌లో ఆయన ఎన్‌ఐఏ ముందు గౌతం నవలఖా లొంగిపోయారు. అనంతరం ఆయన్ను ముంబయిలోని తలోజీ సెంట్రల్ జైలుకు తరలించారు. తన వయసు, అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని హౌస్ కస్టడీ విధించాలని నవలఖా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆయన పిటిషన్ తిరస్కరించారు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నవలఖా పిటిషన్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం విచారించింది. పిటిషనర్ వయసు, అనారోగ్య కారణాల రీత్యా ముంబయిలో హౌస్ కస్టడీలో ఉండేందుకు అనుమతించింది.
హైకోర్టును ఆశ్రయించే యోచనతోనే….
చంద్రబాబుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు రిమాండ్ విధించడంతో ఆ కోర్టులో ఎలాంటి ఊరట దక్కదని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. హౌస్ కస్టడీ పిటిషన్‌పై మంగళవారం ఉదయం కోర్టు నిర్ణయాన్ని వెలువరిస్తే దాని ఆధారంగా హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తున్నారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు వ్యతిరేకంగా నిర్ణయం వస్తే వెంటనే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తున్నారు.
కాన్సిట్యూషనల్ అపెక్స్ కోర్టులకు మాత్రమే ఈ తరహా ఉత్తర్వులు జారీ చేసే అధికారాలు ఉంటాయని గుర్తు చేస్తున్నారు. నవలఖా కేసులో కూడా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందని, చంద్రబాబు విషయంలో ఉన్నత న్యాయస్థానాల్లో మాత్రమే ఊరట దక్కొచ్చని చెబుతున్నారు. వాద ప్రతివాదనల్లో ఉన్న మెరిట్స్ ఆధారంగానే కోర్టు ఓ నిర్ణయానికి వస్తుందని చెబుతున్నారు.