స్వతంత్ర వెబ్ డెస్క్: విజయవాడలోని హోటల్ ఐలాపురం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆధ్వర్యంలో ‘సోషల్ మీడియా-మహిళలపై దాడి’ అంశంపై నిర్వహిస్తున్న సెమినార్‌కు టీడీపీ, జనసేన మహిళ నేతలను పోలీసులు అనుమతించలేదు. దీనిపై మహిళా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను దాటుకుని లోపలికి వెళ్లేందుకు యత్నించారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తదితరులతో పాటు జనసేన మహిళా నేతలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ మహిళా సమస్యలపై జరుగుతున్న సెమినార్‌కు వెళ్తుంటే తమను అడ్డుకుంటారా? అని పోలీసులను నిలదీశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ లోపలికి వెళ్తామని తేల్చిచెప్పారు. జనసేన మహిళా నేత గంటా స్వరూప మాట్లాడుతూ సమావేశానికి కేవలం 200 మందిని మాత్రమే అనుమతిస్తున్నామంటూ తమను పోలీసులు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం వైసీపీ నేతలనే లోపలికి అనుమతించారని ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ఇలా చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ, జనసేన మహిళా నేతలు ఆందోళన కొనసాగించడంతో పోలీసులు వారిని లోపలికి వెళ్లేందుకు అనుమతించారు. దీంతో వంగలపూడి అనిత మరికొంతమంది మహిళా నేతలు వెళ్లి మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మకు వినతిపత్రం అందజేశారు. సోషల్ మీడియాలో తెదేపాకు చెందిన మహిళా నేతలపై మార్ఫింగ్ పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.