ఖమ్మం ఇలాఖాలో పొత్తుల తడాఖా

   తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య ప్రధాన పోటీతో త్రిముఖ పోరు నెలకొంది. అయితే బీఆర్‌ఎస్‌, బీజేపీ ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుండగా కాంగ్రెస్‌ మాత్రం వామపక్షాలతో జత కట్టి బరిలో దిగింది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతుగా నిలుస్తున్నారు కామ్రేడ్స్‌. అయితే ఖమ్మం గుమ్మంలో పొత్తు రాజకీయం కొత్తేమీ కాదు. 2004 నుంచి ప్రతీ పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ ఇది కంటిన్యూ అవుతుండగా ప్రతీ పార్లమెంట్‌ ఎన్నికలకు పరిణామాలు మారిపోతూ వచ్చాయి.

   ఖమ్మం జిల్లాలో పార్లమెంట్‌ ఎన్నికలు కాకరేపుతున్నాయి. గెలుపే లక్ష్యంగా బీజేపీ, బీఆర్‌ఎస్‌, హస్తం పార్టీలు పావులు కదుపుతున్నాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వర్‌రావు, బీజేపీ క్యాండిడేట్‌ తాండ్ర వినోద్‌రావు ఒంటరిగా బరిలో దిగగా కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురామిరెడ్డికి సీపీఎం, సీపీఐ పార్టీలు మద్దతుగా నిలిచాయి. అయితే 2004 నుంచి పొత్తు రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయి. 2004లో కేంద్రంలో వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ ఎన్నికల్లో టీడీపీని ఓడించి కాంగ్రెస్‌ గద్దనెక్కేందుకు తొలిసారి ఉమ్మడి ఏపీలో ఊహించని పొత్తులు ఏర్పడ్డాయి. ఉత్తర, దక్షిణ ధ్రువాలుగా ఉండే ఉభయ కమ్యునిస్టు పార్టీలు కాంగ్రెస్‌తో జతకట్టాయి. అలాగే కామ్రేడ్స్‌తోపాటు బీఆర్‌ఎస్‌ కూడా కాంగ్రెస్‌తో జతకట్టింది. దాంతో 2004లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి రేణుకాచౌదరికి మూడు పార్టీలు మిత్రపక్షంగా వ్యహరించాయి. బీజేపీ మద్దతుతో పోటీ చేసిన టీడీపీ అభ్యర్ధి నామా నాగేశ్వరరావుపై కాంగ్రెస్‌ అభ్యర్ధి రేణుకా చౌదరి లక్షా ఏడు వేల 313 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. ఆ ఎన్నికల్లో రేణుకాచౌదరికి 5 లక్షల 15 వేల 783 ట్లు రాగా, టీడీపీ అభ్యర్ధి నామా నాగేశ్వరరావుకు 4 లక్షల 8 వేల 470 ఓట్లు వచ్చాయి. సీపీఐఎంఎంల్‌ న్యూడెమోక్రసి అభ్యర్ధి చండ్ర అరుణకు 50 వేల 509 ఓట్లు లభించాయి.

   ఐదేళ్లు గడిచి మళ్లీ పార్లమెంట్‌ ఎన్నికలు వచ్చేనాటికి మిత్రపక్షాలు శత్రుపక్షాలుగా మారాయి. 2004లో కాంగ్రెస్‌ అభ్యర్ధి రేణుకాచౌదరికి మిత్రపక్షాలుగా ఉన్న సీపీఎం, సీపీఐ, బీఆర్‌ఎస్‌, తెలుగుదేశం పార్టీతో జతకట్టాయి. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి నామా నాగేశ్వరరావుకు కామ్రేడ్స్‌తోపాటు గులాబీ దళం అండగా నిలిచింది. ఆ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉంది. దాంతో ప్రతిపక్షంలో కాంగ్రెస్‌ ఉండగా మద్దతు ఇచ్చిన సీపీఐ, సీపీఎం. బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు శత్రు పక్షాలుగా మారి ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకి మిత్రపక్షాలుగా మారాయి. మూడు పార్టీల మధ్దతుతో బరిలో దిగిన టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వర్‌రావు, తన ప్రత్యర్థి రేణుకాచౌదరిని ఓడించి లక్షా 24 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. నామాకు 4 లక్షల 69 వేల 368 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్ధి రేణుకా చౌదరికి 3 లక్షల 44 వేల 920 ఓట్లు లభించాయి. 2004, 2009 ఎన్నికల్లో రేణుకా, నామా గెలుపులో సీపీఐ, సీపీఎం, బీఆర్‌ఎస్‌లు కీలకపాత్ర పోషించాయి.

   ఇక 2014 ఎన్నికలు వచ్చేసరికి వామపక్షాలు చెరో దారి అయ్యాయి. ఆ ఎన్నికల్లో సీపీఐతో కాంగ్రెస్‌ జతకట్టగా, సీపీఎం వైసీపీతో చేయి కలిపింది. బీజేపీ మద్దతుతో టీడీపీ బరిలో దిగగా.. తొలిసారి బీఆర్‌ఎస్‌ ఒంటరిగా పోటీచేశాయి. అయితే, సీపీఎం మద్దతుతో పోటీ చేసిన వైసీపీ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకున్నారు. 10,995 ఓట్ల మెజార్టీతో విక్టరీ కొట్టారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పోటీ చేయకుండా మిత్రపక్షమైన సీపీఐకి మద్దతు తెలిపింది. అయినప్పటికీ సీపీఐ అభ్యర్ధి నారాయణకు ఓటమి తప్పలేదు. ఆయనకు 1,87,266 ఓట్లు మాత్రమే రావడంతో మూడో స్ధానానికి పరిమితమయ్యారు. గెలిచిన పొంగులేటికి 4,18,609 ఓట్లు రాగా, బీజేపీ మద్దతుతో పోటీ చేసిన టీడీపీ అభ్యర్ధి నామా నాగేశ్వరరావుకు 4,07,614 ఓట్లు లభించాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి బుడాన్‌బేగ్‌కు 88,944 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 2019 ఎన్నికల్లోను వామపక్షాలు చెరో దారిలోనే పయనించాయి. కాంగ్రెస్‌కు సీపీఐ, టీడీపీ మిత్రపక్షాలుగా వ్యవహరించగా.. బీఆర్‌ఎస్‌, సీపీఎం, బీజేపీ, జనసేన పార్టీలు ఒంటరిగా పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి నామా నాగేశ్వరరావు 1,67,613 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. నామాకు 5,66,621 ఓట్లు రాగా కాంగ్రెస్‌ అభ్యర్ధి రేణుకాచౌదరికి 3,99,008 ఓట్లు వచ్చాయి. సీపీఎం అభ్యర్ధి బోడ వెంకట్‌కు 57,102 ఓట్లు, బీజేపీ అభ్యర్ధి దేవకి వాసుదేవరావుకు 20,488 ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్ధి నార్ల సత్యనారాయణకు 19,315 ఓట్లు లభించాయి.

   ఇక ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ పొత్తులు ఆసక్తికరంగా మారాయి. గత ఏడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ చేతులు కలిపేందుకు నిరాకరించి ఒంటరిగా పోటి చేసిన సీపీఎం ఇప్పుడు ఖమ్మం ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతునిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉన్న సీపీఐ కూడా కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ అభ్యర్ధి రఘురామిరెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ నాయకులు పాల్గొని మద్దతు ప్రకటించారు. ఇక బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి నామ నాగేశ్వరరావు ఒంటరిగానే బరిలో నిలిచారు. ఎన్డీయేలో భాగస్వామి పక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీలు తెలంగాణలో ఇంకా మద్దతుపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో.. బీజేపీ అభ్యర్ధి తాండ్ర వినోద్‌రావు కూడా ఒంటరిగానే ఎన్నికల బరిలో నిలిచారు. అయితే, కాంగ్రెస్‌ అధికారంలో ఉండటంతో రఘురామిరెడ్డి విజయం సునాయాసమేనన్న టాక్‌ వినిపిస్తోంది. అయినప్పటికీ పొత్తులతో బరిలో దిగింది హస్తం పార్టీ. మరి కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య హోరాహోరీ పోరుతో ఈ ఎన్నికల్లో విజయం ఎవరికి వరిస్తుందో చూడాలి మరి.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్