సీఎం పదవిని పదిలం చేసుకోవడానికి సీఎం రేవంత్‌రెడ్డి కొత్త వ్యూహాన్ని ఎంచుకున్నారా..? అటు ప్రతిపక్షాలకు కౌంటర్ ఇస్తూనే.. ఇటు పార్టీలోని సీనియర్లను మచ్చిక చేసుకునేందుకు రేవంత్ ద్వంద వ్యూహ చతురతను ప్రదర్శిస్తున్నారా..? ఇంతకీ రేవంత్ సీఎం అయ్యాక ఆయనలో వచ్చిన మార్పు ఏంటి..? సీఎం పీఠం ఎక్కాక రేవంత్ రెడ్డిలో హుందాతనం పెరిగిందా..?
లోక్‌సభ ఎన్నికలలో సత్తా చాటి మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ వ్యూహాలు పన్నుతోంది. అయితే ఈ ఎన్నికల బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకున్నారు సీఎం రేవంత్. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయన ఈ పార్లమెంట్ ఎన్నికలకు కూడా స్టార్ క్యాంపెయినర్‌గా కాంగ్రెస్ దళాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అయితే సీఎం పదవిని పదిలం చేసుకునేందుకు రేవంత్ రెడ్డి కొత్త వ్యూహాన్ని ఎంచుకున్నట్లుగా కనపడుతోందని విశ్లేషకులు అంటు న్నారు. అటు ప్రతిపక్ష నేతలకు కౌంటర్ ఇస్తూనే, ఇటు సొంత పార్టీ నేతలను మచ్చిక చేసుకునేందుకు రేవంత్ ద్వంద్వ వ్యూహ చతురతను ప్రదర్శిస్తున్నారని వారు చెబుతున్నారు.
సీఎం పీఠం ఎక్కిన తర్వాత రేవంత్ వ్యవహార శైలిలో కొంత మార్పు వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. రాజకీయాల్లో ఎక్కడ నెగ్గాలో కాదు. ఎక్కడ తగ్గాలో తెలియాలి అన్న సిద్ధాంతాన్ని రేవంత్ గట్టిగానే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోందనేది విశ్లేషకులు మాట. భువనగిరి పార్లమెంట్ సీటు విషయంలో పట్టు పట్టి అధిష్టానం వద్ద తన సన్నిహితుడికి టిక్కెట్ ఇప్పించుకున్న రేవంత్. అదే భువనగిరి టిక్కెట్ ఆశించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ని ఇన్‌చార్జ్‌గా చేసి చాకచక్యంగా వ్యవహరించారు. దీంతో సరిపెట్టకుండా భేద భావాలు, వ్యక్తిగత వైరుధ్యాలు పక్కన పెట్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లి భువనగిరి పార్లమెంట్ సమీక్ష సమావేశంలో పాల్గొన్న విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
ఇదే కాకుండా పీసీసీగా ఉన్న సమయంలో తనకు అడ్డుతగిలిన నాయకులను తనవైపు తిప్పుకునే ప్రయత్నలు మొదలుపెట్టారు సీఎం రేవంత్. అందులో భాగంగానే మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ రోజు నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో జగ్గారెడ్డిని పైకి పిలిచి..మరీ స్వయంగా రేవంత్ ఆయన మీసాన్ని మెలేయడం హాట్‌టాపిక్ గా మారింది. అంతే కాకుండా రేవంత్ పీసీసీ పదవి కొనుక్కున్నారని, గతంలో వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డిని ఉద్దేశిస్తూ తన తర్వాత సీఎం అయ్యే అర్హత ఆయనకే ఉందని అని బాంబ్ పేల్చారు రేవంత్. ఇది ఒకరకంగా ఇరువురి నేతల నడుమ సహృద్బావం చూపినా.. ఇతర ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు కొంత గాయం చేసినట్లు అయిందనే వాదన ఉంది. మొత్తానికైతే సీఎం అయ్యాక రేవంత్ వ్యవహార శైలిలో మార్పు కనిపిస్తోందని..సీఎం పీఠం ఎక్కాక ఆయనలో హుందాతనం పెరిగిందనే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నాయి.


