మిస్ ఇండియా పోటీలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో 90 శాతం ఉన్న దళిత, ఆదివాసీ, ఓబీసీ వర్గాల ప్రజలకు తగిన వాటా దక్కడం లేదని అన్నారు. ఈ క్రమంలో కొన్ని రంగాలను ఉదహరిస్తూ.. తాను మిస్ ఇండియా జాబితాను పరిశీలించానని… అందులో ఒక్కరు కూడా దళితులు, ఆదివాసీలు లేరని చెప్పారు. చివరకు ఓబీసీలు కూడా కనిపించలేదన్నారు. కొందరు బాలీవుడ్ గురించో, క్రికెట్ గురించో మాట్లాడతారని… చెప్పులు కుట్టేవారి గురించి , ప్లంబర్ గురించి ఏ ఒక్కరూ చూపించరని అన్నారు. చివరకు మీడియాలో ఉన్న టాప్ యాంకర్లు దేశంలో 90 శాతం జనాభా ఉన్న వర్గాలకు చెందినవారు కాదన్నారు రాహుల్ గాంధీ. అలాగే సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, బాలీవుడ్, మిస్ ఇండియా వంటి వాటిలో 90 శాతం జనాభా కల్గిన వర్గాల నుంచి ఎంత మంది ఉన్నారో తెలియాలని అన్నారు. ఈ 90 శాతం జనాభా కల్గిన వర్గాలకు తగిన వాటా దక్కుతుందా లేదా అన్నది పరిశీలించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి.