ప్రధాని మోదీ ఇవాళ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ప్రధాని మోదీ మెదక్‌లో పర్యటించనున్నారు. బీజేపీ మెదక్, జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థులు రఘునందన్‌రావు, బీబీ పాటిల్‌లకు మద్దతుగా ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
మెదక్ జిల్లా అందోలు నియోజకవర్గం అల్లాదుర్గం మండలం చిల్వర గ్రామ శివారు ఐబీ చౌరస్తాలో సాయంత్రం 4.30 గంటలకు జరగనున్న ఈ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెదక్, జహీరాబాద్ లోక్‌సభ స్థానాలకు సంబంధించి 14 అసెంబ్లీ నియోజకవర్గాలు.. మెదక్, నర్సాపూర్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్, అందోలు, జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డికి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమా నులు, ప్రజలు సభకు హాజరు కానున్నారు. దాదాపు 30 ఎకరాల్లో సభ నిర్వహిస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీగా పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. 3 హెలిప్యాడ్లు నిర్మించారు. ప్రధాని ప్రత్యేక హెలికాప్టర్లో మహారాష్ట్రలోని లాతూర్ నుంచి మధ్యాహ్నం 3.20గంటలకు బయల్దేరి సాయంత్రం 4.20కి సభాస్థలికి చేరుకుంటారు ప్రధాని మోదీ. సాయంత్రం 4.30 గంటల నుంచి 5.25గంటల వరకు బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్లో 5.55 గంటలకు దుండిగల్ విమానాశ్రయం చేరుకుని అక్కడినుంచి ఢిల్లీకి వెళ్తారు.


