తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్( Vijay) శాసనసభలో బల పరీక్షలోనూ నెగ్గారు. అనంతరం అసెంబ్లీలో కీలక ప్రసంగం చేశారు. తమ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలను నమ్ముకుని ఎన్నికల్ఓల పోటీ చేశామని.. అన్ని వర్గాలకు తమపై నమ్మకం ఉందన్నారు.
‘‘మా ప్రభుత్వం పూర్తి ఐదేళ్ల పాటు కొనసాగుతుంది. లౌకిక విధానాన్ని అనుసరిస్తూ ప్రజలందరికీ సమాన న్యాయం అందించేలా పాలన సాగిస్తాం’’ అని విజయ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.
మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్న విజయ్… సామాజిక న్యాయం అందరికీ చేరేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మూడేళ్లలోనే 34.92 శాతం ఓటింగ్ సాధించామన్న సీఎం విజయ్… అధికారంలో ఉన్నామని ఎవరినీ బెదిరించమని.. పదవులు, రాజకీయాల కోసం పాకులాడమని స్పష్టం చేశారు
ఇదే సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక విధుల అధికారి (రాజకీయ)గా రిక్కి రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకంపై వచ్చిన విమర్శలపై కూడా విజయ్ స్పందించారు. ఈ నియామకంపై పలు రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో, దానిని పునఃసమీక్షిస్తామని తెలిపారు.
బలపరీక్షలో నెగ్గిన విజయ్
ఇవాళ ఉదయం జరిగిన బలపరీక్షలో విజయ్ ప్రభుత్వం నెగ్గింది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ తమిళ వెట్రి కళగం( Tamilaga Vettri Kazhagam) విజయం సాధించిన నేపథ్యంలో, బుధవారం జరిగిన విశ్వాస పరీక్షలో విజయ్‌కు మద్దతు లభించింది. దీంతో ఆయన అధికారికంగా తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు స్పష్టమైంది.
అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో టీవీకే ప్రభుత్వానికి 144 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే (Dravida Munnetra Kazhagam) సభ నుంచి వాకౌట్ చేయగా, మూడో అతిపెద్ద పార్టీ అయిన అన్నాడీఎంకే (All India Anna Dravida Munnetra Kazhagam) ఓటింగ్‌కు దూరంగా నిలిచింది.
సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్, తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందుతూ తమిళనాడు రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎదిగారు. ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయంగా భావిస్తున్నారు.


