మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.. దీనికోసం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఆయా పురపాలక సంఘాల కౌన్సిలర్లు, ఎంపీ టీసీ, జడ్పీటీసీ సభ్యులు, ఎక్స్‌అఫీషియో సభ్యులు తమ ఓటుహక్కును వినియోగించుకో నున్నారు. మొత్తం 1,439 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్, వీడియోగ్రాఫర్ల ద్వారా ఎన్నికల అధికారులు ఓటింగ్ సరళిని పరిశీలిస్తారు.
ఓటింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను మహబూబ్‌నగర్ బాలుర జూనియర్ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరచనున్నారు. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్‌కుమార్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్‌గౌడ్ బరిలో ఉన్నారు. గత వారం రోజులుగా ప్రధాన పార్టీలకు చెందిన ఓటర్లు గోవా క్యాంపులో ఉన్నారు. వీరంతా నిన్న కర్ణాటకకు చేరుకున్నారు. పోలింగ్ సమయానికి కేంద్రాలకు వచ్చేలా ప్రధాన పార్టీలు ఏర్పాట్లు చేశాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ఎమ్మెల్సీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.