Medak: వీడెవండి బాబూ.. ఇలా ఉన్నాడు. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ఒప్పుకోవట్లేదనో.. ఫలానా సంస్థలో అన్యాయం జరిగిందనో.. వాటర్ ట్యాంకులు, సెల్ టవర్లు ఎక్కి హల్ చల్ చేయడం చూసి ఉంటాం. కానీ వీడు మాత్రం అత్తింటివారు బంగారం పెట్టలేదని విద్యుత్ స్తంభం ఎక్కి హల్ చల్ చేశాడు. వినడానికి వింతగా ఉన్నా నిజంగానే మెదక్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మెదక్ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన శేఖర్ ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. కట్నం కింద అత్తింటివారు బంగారం పెట్టాలని కోరాడు. వారు బంగారం పెట్టకపోయేసరికి ఇలా విద్యుత్ స్తంభం ఎక్కి చనిపోతానని హడావుడి చేశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్తంభానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. బంగారం పెట్టేలా చూస్తామని మార్కెట్ కమిటీ చైర్మన్ జగపతితో పోలీసులు హామీ ఇవ్వడంతో కిందకు దిగాడు. దీంతో అందరూ హమ్మాయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు.