స్వతంత్ర వెబ్ డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక చైర్మన్, దివంగత శ్రీ ధీరూభాయ్ అంబానీ 21వ వర్ధంతిని పురస్కరించుకుని, డెక్కన్ బ్లడ్ సెంటర్ సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గురువారం జియో తెలంగాణ ప్రధాన కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. జియో తెలంగాణ సీఈఓ కె.సి.రెడ్డి దివంగత వ్యవస్థాపక చైర్మన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రక్తదాన శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన రక్తదానం చేశారు. సంస్థ ఉద్యోగులు సైతం అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధీరూభాయ్ అంబానీ ఎంతో మంది పారిశ్రామిక వేత్తలకు స్ఫూర్తిగా నిలిచారని.. పెట్రోల్ పంపులో మొదలైన ప్రయాణం.. ఆ తరువాత వేల కోట్ల రూపాయలతో వ్యాపార దిగ్గజంగా ధీరూభాయ్ అంబానీ ఎదిగిన తీరు అందరికీ స్ఫూర్తినిస్తుందని జియో తెలంగాణ సీఈఓ కె.సి.రెడ్డి తెలిపారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఇలా రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రక్తం కొరత వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని, అటువంటి వారందరికీ రక్తదాతలు ఇచ్చే రక్తం సంజీవని అని పేర్కొన్నారు. అత్యవసర స్థితిలో ఉన్న రోగికి రక్తం అవసరం ఉంటుందని, రోడ్డు ప్రమాద ఘటనల్లో గాయపడి సకాలంలో రక్తం అందక చనిపోయినవారు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారని అన్నారు. రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుందని కె.సి.రెడ్డి తెలిపారు.