రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 8 నెలల కాలంలోనే ప్రభుత్వ విద్యను కాంగ్రెస్ సర్కార్ అస్తవ్యస్థం చేసిందని మండిపడ్డారు. పేద, మధ్య తరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు లేరన్న కారణంతో ఈ ఏడాది దాదాపు గా 1,864 స్కూళ్లను మూసేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నాణ్యమైన విద్యను అందించాల్సిన ప్రభుత్వం… ఆ దిశగా చర్యలు చేపట్టకుండా స్కూళ్లను మూసి వేయాలని భావిస్తోందని మండిపడ్డారు.
2024లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 2.4 లక్షలు తగ్గింది. ఇది రాష్ట్ర విద్యారంగానికి ప్రమాద సంకేతమని ఆందోళన వ్యక్తం చేశారు. 8 నెలల కాలంలోనే ప్రభుత్వ విద్యను కాంగ్రెస్ సర్కార్ అస్తవ్యస్థం చేసిందని మండిపడ్డారు. అసలు ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుందో గుర్తించి ఆ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిద్రావస్థలో ఉండటంతోనే ఈ దుస్థితి దాపురించిందన్నారు.
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల సంఖ్య లేకపోవటంతోనే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో దాదాపుగా 25 వేల టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెంటనే వాటిని భర్తీ చేయాల్సిన అవసరముందన్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వమే సమస్యలను సృష్టిస్తోందని మండిపడ్డారు.