అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోగానే గులాబీ బాస్‌కు హ్యాండిచ్చి హస్తం చేయి పట్టుకున్నారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు. 10 ఏళ్లపాటు అధికారాన్ని అనుభవించి.. ప్రతిపక్ష హోదాను జీర్ణించుకోలేని నేతలంతా రేవంత్ ఆపరేషన్‌కు ఆకర్షితులయ్యారు. దీంతో వరుసగా క్యూకట్టి మరీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే,.. వీరిని వేటు గుబులు వెంటాడుతోంది. కాంగ్రెస్ హైకమాండ్ ఊహించిన స్థాయిలో ఎమ్మెల్యేలు చేరకపోవడంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వేటు గుబులు వెంటాడుతోంది. బీఆర్‌ఎస్ వేసిన పిటిషన్‌పై తీర్పు ఎలా వస్తుందోనన్న టెన్షన్‌తో కంటి మీద కునుకు కరువైంది.
మరోపక్క బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన వీరిపై నియోజకవర్గాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కండువాలు మార్చి ఆరు నెలలవుతున్నా కండువాలు మార్చి ఆరునెలలు అవుతున్నా తమకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని జనం ఆగ్రహిస్తుంటే.. మరోపక్క సొంత పార్టీ నేతలు తమను కలుపుకుని పోవడం లేదంటూ దాడులకు దిగుతున్నారు. పదేళ్లపాటు పార్టీ కోసం కష్టపడ్డవారిని పక్కనపెట్టారన్న అక్కసును బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై కక్కుతున్నారు హస్తం శ్రేణులు. ఈ క్రమంలోనే ఇటీవల చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాన్వాయ్‌పై కోడి గుడ్లతో దాడికి దిగారు. గద్వాల్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి వర్సెస్ ఇంచార్జి సరిత మధ్య విబేధాలు భగ్గుమంటున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైడ్రా షాకివ్వడంతో పార్టీలో సముచిత గౌరవం దక్కలేదన్న నిరాశలో ఉన్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీలో చేరి ఆస్తులు కాపాడుకోవాలన్న ఆయన ఆశలపై నీళ్లు చల్లింది హైడ్రా.