ఏపీలో మహిళలకు, ఆడపిల్లలకు రక్షణ కరువైందని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శలు చేశారు. ఎక్కడ చూసిన రేప్, మర్డర్లు, బాత్ రూంలో హిడెన్ కెమెరాలు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరస్తులకు ఇంత ధైర్యం రావడానికి కారణం ప్రభుత్వమే? అంటూ ధ్వజమెత్తారు. ఈ పరిస్థితి చూసి ప్రభుత్వం సిగ్గు పడాలన్నారు. దిశ యాప్ ద్వారా గత వైసీపీ ప్రభుత్వం నిందితులను పట్టుకుని 24 గంటల్లో శిక్షించారని గుర్తు చేశారు. జగన్ అన్న పాలనలో ఇలాంటి ఘటనలు చూడలేదని తెలిపారు.
రెడ్ బుక్ రాజ్యాంగంపై పెట్టిన శ్రద్ధ ఆడపిల్లలు, మహిళల రక్షణపై శ్రద్ధ పెట్టాలని కోరారు. మదనపల్లెలో ఫైల్ దగ్ధం కేసుపై స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లి విచారణ చేపట్టారని, ఆడపిల్లకు అన్యాయం జరిగితే శ్రద్ధ చూపడం లేదు ఎందుకని ప్రశ్నించారు. హిడెన్ కెమెరాలు పెట్టారని విద్యార్థినులు చెప్తుంటే అలాంటిది ఏమీ లేదని ఎస్పీ చెప్పడం సిగ్గు చేటన్నారు. న్యాయం కావాలని 300 మంది విద్యార్థినులు ధర్నాకు దిగితే కంటి తుడుపు చర్యగా విచారణ చేపడతామని అధికార యంత్రాంగం దిగి రావడం సూచనీయమన్నారు. నూతన ప్రభుత్వంలో ర్యాగింగ్ భూతం పేట్రేగిపోతుందని తెలిపిన రోజా నారాయణ కాలేజీలో ర్యాగింగ్ చేసి మెడికల్ విద్యార్థినిని చంపేశారన్నారు. కలికిరి జేఎన్టీయూ కళాశాలలో ర్యాగింగ్ కారణంగా విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. గత ఐదేళ్లలో లేని ర్యాగింగ్ భూతం ఇప్పుడు మళ్లీ తాండవం చేస్తోందని విమర్శలు చేశారు.