హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసును సీఐడీకి అప్పగించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ ఆదేశించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోందని మంత్రి చెప్పారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి, ఈ రాకెట్‌లో ఉన్న ప్రతి ఒక్కరినీ పట్టుకోవాలని మంత్రి ఆదేశించారు. దోషులకు చట్టప్రకారం కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు ఉండాలని దామోదర రాజనర్సింహ అన్నారు.
దీంతో కిడ్నీ మార్పిడిలపై సీఐడీ విచారణ జరపనుంది. అలకనంద ఆస్పత్రి ఘటనతో విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. కొన్నేళ్లుగా ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగిన.. కిడ్నీ ఆపరేషన్లపై సీఐడీ దర్యాప్తు చేపట్టనుంది. ఈ కేసులో మరోవైపు పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈవ్యవహారంలో అలకనంద ఆస్పత్రి ఛైర్మన్ సుమంత్, మరో వ్యక్తి గోపి సహా 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సుమంత్ గోపీని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.