తెలంగాణ పారిశ్రామికవేత్తలతో దావోస్‌లో అగ్రిమెంటా? అంటూ ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పెట్టుబడులు పేపర్‌కు మాత్రమే పరిమితం కావొద్దని.. తెలంగాణ నుంచి పారిశ్రామిక వేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పారిశ్రామికవేత్తలను వేధిస్తున్నారని ఆరోపించారు. అందుకే అనేకమంది పారిశ్రామిక వేత్తలు మహారాష్ట్ర , మధ్యప్రదేశ్‌కి వెళ్లిపోతున్నారని కామెంట్ చేశారు.
“వేధింపులు ఆపకుండా ఇతర దేశాలకు వెళ్ళి ఒప్పందాలు చేసుకోవడం సరికాదు. కాంగ్రెస్ వేధించని కంపెనీలు లేవు. ముందు ఇల్లు చక్కగా పెట్టుకుని బయటకెళ్ళి ఒప్పందాలు చేసుకోవాలి. రాహుల్ గాంధీ రాజ్యాంగం, రాజకీయాలపై అవగాహన లేని వ్యక్తి. ఆనాడు వల్లభాయ్ పటేల్‌ను పక్కన పెట్టి నెహ్రూ ప్రధాని అయ్యారు. అంబేద్కర్ ఆలోచనలకు విరుద్ధంగా కాంగ్రెస్ పని చేసింది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాలను కూల్చింది. పత్రిక స్వేచ్ఛ ను హరించింది. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంపై రాహుల్ గాంధీ సర్టిఫికెట్ మాకు అవసరం లేదు”.. అని కిషన్ రెడ్డి అన్నారు.