ప్రాగ్దిశ వీణియ పైన దినకర మయూఖ తంత్రులపైనా..
జాగృత విహంగ తతులె వినీల గగనపు వేదిక పైన…
పలికిన కిలకిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా..
విశ్వకావ్యమునకిది భాష్యముగా….

ఈ పాట విన్న ఎవరికైనా…ఒక్కసారి మళ్లీ ఆ పాటను వినాలన్నంత కోరిక మనసులో బలంగా పుడుతుంది. విన్నాక …ఆ రోజంతా ఆ పాట మన మనసులో, పెదవులపై నాట్యమాడుతూనే ఉంటుంది.అది పాటకి ఉన్న గొప్పతనమైతే…సిరివెన్నెల సాహిత్యానికి ఉన్న మహత్యం.

అంతటి గొప్ప సాహిత్యాన్ని తనలోనే దాచుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రిలోని గొప్ప తనాన్ని మొదట చూసినవాడు విశ్వనాథుడే. కాకినాడలో విశ్వనాధ్ కి సన్మానం చేస్తుంటే, అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్న సీతారామశాస్త్రి గురించి ఆయనకి ఒకరు విన్నవించారంట. కారులో వెళుతుంటే తను రాసిన కవితా సాహిత్యాన్ని ఆయన చేతికిచ్చారంట. కొన్ని రోజుల తర్వాత విశ్వనాథ్…ఒక కార్డు మీద… అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చెబుతానని సీతారామశాస్త్రికి జాబు రాశారంట.
అలా రెండుమూడేళ్ల తర్వాత 1984లో బాలకృష్ణతో చేసిన ‘జననీ జన్మభూమి’ సినిమాలో ఒక పాట రాయమని చెబితే…ఎంతో ఉత్సాహంగా సీతారామశాస్త్రి రాసి పంపారంట. అది ఆయన మొదటి పాట. తర్వాత మళ్లీ విశ్వనాథుడే తనని గుర్తు పెట్టుకుని 1986లో సిరివెన్నెల సినిమా తీస్తూ కబురు పెడితే సీతారామశాస్త్రి మద్రాసు వెళ్లారంట.

అలా ఆయనతో ఒక పాట అనుకుని మొదలుపెడితే, ఆ తెలుగు నుడికారం, శబ్ధ సౌందర్యం, అర్థాలంకారం…ఎంత ఒడుపుగా, ఎంత పొదుపుగా, ఎంత వయ్యారంగా గలగల పారే గోదావరిలా ప్రవహిస్తూ వెళుతుంటే ముచ్చటపడిన విశ్వనాథుడు…మొత్తం సీతారామశాస్త్రితోనే అన్ని పాటలు రాయించారు.
చివరికి సిరివెన్నెల విడుదలైంది. అది మరొక సంగీత ప్రభంజనం. ఆ సినిమాయే సీతారామశాస్త్రి ఇంటిపేరుగా మారిపోయింది. అప్పటి నుంచి ఆయన సిరివెన్నెల సీతారామశాస్త్రి అయిపోయారు. ఆయన అసలు పేరే మరిచిపోయేలా చేసిన ఘనత విశ్వనాథుడికే చెందుతుంది. అలా సీతారామశాస్త్రి లాంటి మహోన్నత సాహితీ వ్యక్తిని తెలుగు సినిమాకి పరిచయం చేసిన పుణ్యాత్ముడు విశ్వనాథ్ అని చెప్పాలి.

సీతారామశాస్త్రి సాహిత్య గొప్పతనం చెప్పాలంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పాలి. ఆయన మాటలు ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే…
‘‘ప్రాగ్దిశ వీణియ పైన దినకర మయూఖ తంత్రులపైనా..’’ ఈ అర్థం తెలీక తను లైబ్రరీలను ఎలా వెతికాడు..అప్పటి నుంచి భాషపై ఆయనకి మమకారం ఎలా పుట్టిందో త్రివిక్రమ్ చెబుతూ వచ్చారు. అంటే పరోక్షంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి మాటల మాంత్రికుడిని తెలుగు సినిమాకి తీసుకువచ్చేలా చేసింది విశ్వనాథుడే అని చెప్పాలి.

విశ్వనాథ్ సినిమా- సీతారామశాస్త్రి పాట…తెలుగు సినిమా సాహిత్య వైభవాన్ని చాటి చెప్పాయని చెప్పాలి. స్వర్ణ కమలం సినిమాలో ‘ఘల్లు ఘల్లు మంటూ మెరుపల్లె తుళ్లు’ ‘‘అందెల రవమిది పదములదా, ఆపద్భాందవుడులో ‘‘ ఔరా అమ్మకు చెల్లా, ఆలకించి నమ్మడమెల్లా’’, శుభ సంకల్పంలో ‘‘హరి పాదాన పుట్టావంటే గంగమ్మా’’ నీలాల కన్నుల్లో సంద్రమే…నింగి నీలమంతా సంద్రమే హైలెస్సో హైలెస్సా’’ ఇలాంటి పాటలు కోకొల్లలుగా వచ్చాయి. సూత్రధారులు, స్వాతికిరణం, ఆపద్భాందవుడు ఇలా ఎన్నో సినిమాల్లో పాటల పల్లవులు, చరణాలు చిరస్థాయి పొందాయి.