Legendary Director K viswanath no more: భారత చిత్ర పరిశ్రమ గర్వించతగ్గ దర్శక దిగ్గజం కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూశారు. అశేష భారతావనిని శోకసంద్రంలో ముంచి మరలిరాని లోకాలకు తరలివెళ్లారు.
మరిచిపోతున్న భారతీయ సంగీత విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయ దర్శకుడు. ఒక రకంగా చెప్పాలంటే సంగీతాన్ని బతికించిన విదూషకుడు. పాశ్చాత్య సంగీత మోజులో మన భారతీయ సంగీతం ఎక్కడ కనుమరుగైపోతుందోననే భావనతో, సరిగ్గా 42 ఏళ్ల క్రితం తీసిన ‘శంకరాభరణం’… సినిమా ఆరోజుల్లో సంచలనం సృష్టించింది. భాష తెలియని రాష్ట్రాల్లో కూడా ఆ సినిమా శతదినోత్సవం చేసుకుందంటే సంగీత ప్రభావం ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

శంకరాభరణం సినిమా 1980 ఫిబ్రవరి 2న విడుదలైంది. తెలుగు సినిమా గతిని, ప్రజల మనోగతిని మార్చిన సినిమాగా కీర్తి శిఖరాలను అందుకుంది. ఆ సినిమా విడుదలైన రోజునే అంటే ఫిబ్రవరి 2నే విశ్వనాథ్ శివసాన్నిధ్యం పొందడం యాదృచ్చికమే. అది మహానుభావులకే సొంతం. భీష్మ పితామహుడు తన మరణాన్ని ఏకాదశి రోజున మరణించినట్టుగా, విశ్వనాథ్ కూడా శంకరాభరణం సినిమా విడుదలైన రోజే మరణించడం అసాధారణ విషయం.
శంకరాభరణం సినిమా వచ్చినప్పటి నుంచి ప్రతి ఇంటిలో అందరూ కూడా తమ పిల్లలకు శాస్త్రీయ సంగీతం నేర్పించాలని కంకణం కట్టుకోవడం విశేషం. ఆ సినిమా ప్రభావం ఒక సునామీలా ప్రజల మీదకు వచ్చింది. ఆ రోజున నేర్చుకున్న ఎంతోమంది చిన్నారులు వారసత్వంగా తమ పిల్లలకు నేడు అందించరాన్నది ఒక నిజం. సనాతన సంగీత సంప్రదాయాలను మరో తరానికి తీసుకువెళ్లడానికి నాంది పలికింది శంకరాభరణం సినిమా అని ఘంటాపథంగా చెప్పవచ్చు.

శంకరాభరణం సినిమా ప్రవాహంలో విశ్వనాథ్ కొట్టుకుపోయారనే చెప్పాలి… ఇక అప్పటి నుంచి సంగీత ప్రాధాన్యం ఉన్న సినిమాలనే తీసుకుంటూ వెళ్లారు. అలాంటి వాటిలో వచ్చిన ఆణిముత్యాలెన్నో… స్వాతి ముత్యం, సాగర సంగమం, సిరివెన్నెల, స్వర్ణ కమలం ఇవన్నీ సంగీత ప్రాధాన్యం ఉన్న సినిమాలే. అంతటి గొప్ప దర్శక దిగ్గజం మనకిక లేరని చెప్పలేం. ఎందుకంటే ఆయన మనతోనే ఉన్నారు. మనలోనే ఉన్నారు. సంగీతం బతికి ఉన్నంత కాలం…విశ్వనాథ్ జీవించే ఉంటారనేది ఒక సత్యం.