ప్రముఖ దర్శకులు కే విశ్వనాథ్ కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన సినిమా కార్యకలాపాలకు దూరంగా ఉంటూ ఇంటిపట్టునే ఉంటున్నారు. గురువారం అర్థరాత్రి సమయంలో ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.

తెలుగు సినిమాల్లో దిగ్గజం గా ఆయన పేరు గాంచారు. గుంటూరు జిల్లా రేపల్లె లోని సాంప్రదాయ కుటుంబంలో ఆయన జన్మించారు. ఇంటర్,డిగ్రీ గుంటూరు నగరంలో చదువుకొన్నారు. అనంతరం చెన్నయ్ చేరుకొని సినిమా పరిశ్రమలో టెక్నీషియన్ గా ప్రవేశించారు. ఒక స్టూడియోలో సౌండ్ రికార్డిస్టుగా సినిమా జీవితాన్ని మొదలుపెట్టాడు. అన్నపూర్ణ సంస్థ నిర్మించిన తోడికోడళ్ళు అనే సినిమాకు పనిచేస్తున్నపుడు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో పరిచయం ఏర్పడి ఆయన వద్ద సహాయకుడిగా చేరాడు. ఆయనతో కలిసి అన్నపూర్ణ వారి ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అప్పటికే ఆయన ప్రతిభను గుర్తించిన అక్కినేని నాగేశ్వరరావు తర్వాత సినిమాకు దర్శకుడిగా అవకాశం ఇస్తానని వాగ్దానం చేశాడు.
దర్శకునిగా ప్రమోషన్ పొందేందుకు విశ్వనాథ్ కొంత కాలం పాటు వేచి చూడాల్సి వచ్చింది. అక్కినేని నాయకుడిగా నిర్మించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారారు. గొల్లపూడి మారుతీరావు, రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి ఈ సినిమాకు కథను సమకూర్చగా, భమిడిపాటి రాధాకృష్ణ, గొల్లపూడి కలిసి మాటలు రాశారు. దుక్కిపాటి మధుసూదనరావు స్క్రీన్ ప్లే రాశాడు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి లభించింది. సిరిసిరిమువ్వ సినిమాతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది.
ఆ తర్వాత కే విశ్వనాథ్ వెనక్కి తిరిగి చూడలేదు. కళాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఆయన నిలిచారు. కె విశ్వనాథ్ మొత్తం 60 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు. ఆయన జేవీ సోమయాజులతో చేసిన శంకరాభరణం అద్భుతమైన విజయాన్ని సాధించింది ఈ సినిమాతోనే కె విశ్వనాథ్ దర్శకుడుగా అఖండమైన పేరు సంపాదించాడు.
80వ దశకంలో విశ్వనాథ్ ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. స్వాతిముత్యం, సిరివెన్నెల,శ్రుతిలయలు, స్వయం క్రిషి, స్వర్ణకమలం సూత్రధారులు వంటి సినిమాలతో హిట్లు మీద హిట్లు కొడుతూ వెళ్లిపోయారు. 2000 సంవత్సరం దాటాక ప్రేక్షకులు కమర్షియల్ సినిమాలకు బాగా అలవాటు పడ్డాక ఆయన నెమ్మదిగా పక్కకు జరిగారు. దర్శకునిగా ఆయన చివరి చిత్రం శుభప్రదం అని చెబుతారు.
దర్శకునిగా శిఖరాల్ని అందుకొన్నాక, ఆయన నెమ్మదిగా వెండితెర మీదకు ప్రవేశించారు.
కే విశ్వనాథ్ దర్శకుడుగానే కాకుండా నటుడిగా రాణించారు. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో, మిస్టర్ పర్ఫెక్ట్ లో , ఠాగూర్ సినిమాలో , లక్ష్మీ నరసింహ లో , ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో నటించి తన ప్రతిభను చాటుకొన్నారు.
దర్శకత్వంలో ప్రతిభాశీలి కావటంతో అనేక అవార్డులు ఆయన్ని వెదక్కొంటూ వచ్చాయి.
ఈయన ఎల్వి ప్రసాద్ బి.యన్.రెడ్డి తరువాత దాదాసాహెబ్ ఫాల్కే అందుకొన్న తెలుగు దర్శకునిగా నిలుస్తారు.
శంకరాభరణానికి జాతీయ పురస్కారంతో పాటు సప్తపదికి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది. స్వాతిముత్యం సినిమా 1986లో ఆస్కార్ అవార్డుకు అధికారిక ప్రవేశం పొందింది. భారతీయ సినిమాకు చేసిన సమగ్ర సేవకు గాను విశ్వనాథ్ కు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది.
అనేక యూనివర్శిటీలు ఆయనకు అవార్డులు ఇచ్చి సత్కరించాయి. అలాగే వెండితెర మీద విశిష్ట అవార్డు అనదగ్గ రఘుపతి వెంకయ్య అవార్డుని సైతం అందుకొన్నారు.