శంకరాభరణం తర్వాత తెలుగునాట సంగీత ఒరవడిని కొనసాగిస్తూ ఆ బాణీలో కె.విశ్వనాథ్ తీసిన మరో సినిమా ‘సాగర సంగమం’. అందులో కమల్ హాసన్ నటన, నాట్యం, జయప్రద నట సౌందర్యం సినిమాని పతాక స్థాయిలో నిలిపాయి.
విశ్వనాథ్ తన సినిమాల్లో సున్నితమైన అంశాలనే కథా వస్తువులుగా తీసుకుంటారు. ‘‘సిరిసిరి మువ్వ’’ తర్వాత శంకరాభరణం దగ్గర నుంచి, ఆ నేపథ్యమంతా సంగీత ప్రధానంగానే కథలను తీసుకుని చేశారు.

ఆ తర్వాత ‘సాగర సంగమం’ ఒక చరిత్ర సృష్టించింది. సినిమాలో ఒక పేద నాట్య కళాకారుడు, ఒక పెళ్లయి భర్త వదిలేసిన యువతి మధ్య నడిచిన ప్రేమ కథ సినిమా ఆద్యంతం ఒక ఉత్కంఠగా నడుస్తుంది. వారిద్దరి అభిప్రాయాలు ఒకటే. ఇద్దరికీ సంగీతం, నాట్యం అంటే ప్రాణం…ఆ అంతరంగిక తీగ వారిని పట్టి లాగుతూ సినిమాని ముందుకు నడిపిస్తుంది.
హీరో తన ప్రేమను ఎప్పటికప్పుడు చెప్పాలనుకుంటాడు.
హీరోయిన్ తనెప్పుడు చెబుతాడా? అని ఎదురుచూపులు…
మధ్యమధ్యలో సమాజాన్ని గుర్తు చేస్తూ వీరి మధ్యలోకి తండ్రి పాత్ర వస్తూ వెళుతూ ఉంటుంది.

హీరో కోసం, హీరోయిన్ ఒక ప్రముఖ కళా నాట్య ప్రదర్శనలో అతని పేరు చేర్చడం, ఇదే సమయంలో తల్లి మరణం, వచ్చిన అవకాశం పోవడం, అటు ఢిల్లీ వెళ్లాలా? ఇటు తల్లి అంత్యక్రియలు చూడాలా? అంతర్మథనం…ఆ తల్లి శవం ముందే ఆ తల్లి చివరి కోరికగా నాట్యాన్ని ప్రదర్శించడం, బాధ, సంతోషం, దుఖం, మానసిక వేదన అన్నింటినీ సంగీతం, నాట్యంలో చూపించవచ్చునని చెప్పిన సినిమా సాగర సంగమం.


ఈ సినిమా మొత్తానికి ఎల్లవేళలా ఆదుకునే ఒక నిరుపేద స్నేహితుడు శరత్ బాబు…
సినిమా చుట్టూ అన్నీ సున్నితమైన భావాలతో నిండిపోయిన పాత్రలు…
వాటిని అంతే మృదువుగా సినిమాని నడిపించిన తీరు…
ఇలాంటి కథని కమర్షియల్ గా సూపర్ హిట్ చేసి, ఒక పతాక స్థాయికి తీసుకువెళ్లిన తీరు

నభూతో నభవిష్యత్ అని చెప్పాలి.
ఇక్కడ చెప్పుకోతగిన వారిలో ముఖ్యులు సంగీత దర్శకుడు ఇళయరాజా…
‘‘ఇది నా యుగం’’…అని చెప్పగల సంగీత కారుల్లో ఎవరైనా ఉన్నారంటే ఇళయరాజా ఒక్కరే అని చెప్పాలి. నిజానికి ఆయన కాలం…సంగీతానికి స్వర్ణయుగం అని చెప్పాలి. కమల్ హాసన్, ఇళయరాజా, ఎస్పీ బాలు, జానకి, కాంబినేషనే ఇలా ఎన్నో ప్రత్యేకతలు…
అలాంటి స్వరకర్త సంగీత సారథ్యంలో వచ్చిన ఒక పాట ఇది…


‘‘మౌనమేలనోయి…ఈ మరపురాని రేయి’…
ఎదలో వెన్నెల…వెలిగే కన్నుల
తారాడే హాయిలో….’’
ఈపాట ప్రతి ఒక్కరినీ ఎప్పుడో ఒకప్పుడు తట్టి లేపుతూనే ఉంటుంది. ఆ సన్నివేశం కూడా హీరో స్నేహితుడు శరత్ బాబు మొదటి రాత్రి సందర్భంగా మొదలవుతుంది. ఆ పాటలో జయప్రద-కమల్ హాసన్ నటనా వైశిష్ట్యం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
ఇక జయప్రద భావ సౌందర్యం…తను స్నానం చేస్తూంటే ఒకవైపు నుంచి పాట వస్తూ ఉంటుంది. మరోవైపు తన కళ్లల్లో, మోములో, బాడీ లాంగ్వేజ్ లో ఇక అన్నింటితో పాటు తన అందంతో చూసే ప్రేక్షకులని కనురెప్ప వేయకుండా చేస్తాయి. జయప్రద ఎన్ని సినిమాలు చేసినా, తన అందాన్ని నిర్వచించాలంటే సాగర సంగమం ఒక్కటే అని చెప్పాలి.


కళా తపస్వి దర్శకుడు కె.విశ్వనాథ్ ఈ పాటను ఎక్కడ అసభ్యతకు తావివ్వకుండా, ఎక్కడా శృంగారానికి తావు లేకుండా ఆ పాటను మలిచిన తీరు, ఆ చెక్కిన తీరు, నడిపించిన తీరు, ఒకసారి ఆ పాటను యూట్యూబ్ లో మళ్లీ ఒకసారి చూడండి. ఇప్పుడు దర్శక దిగ్గజం కళాతపస్వి కె.విశ్వనాథ్ కళ్లతో చూడండి.
జయప్రదకి ఒక స్టార్ డమ్ తీసుకువచ్చిన దర్శకుల్లో కె.విశ్వనాథ్ కూడా ఒకరు. జయప్రద కెరీర్ మొదట్లో హీరోయిన్ గా తొలి అవకాశం ఇచ్చిన హీరో కృష్ణ… శ్రీ రాజరాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ సినిమా. అది జయప్రద మూడో సినిమా. తర్వాత కె.బాలచందర్ అంతులేని కథ తీస్తే, ఆ తర్వాత చిత్రమే సిరిసిరి మువ్వ. ఇక జయప్రద ఒక్కసారి తారాపథానికి చేరుకుని మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు.

మళ్లీ వారి కాంబినేషన్ లో వచ్చిన సాగర సంగమం తెలుగు సినిమా చరిత్రలో మకుటాయమానంగా నిలిచిపోయింది.