నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ( Vijay) తీసుకున్న ఓ కీలక నిర్ణయం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. జ్యోతిష్కుడు రిక్కీ రాధాన్ పండిట్ వెట్రివేల్‌ను ముఖ్యమంత్రికి ప్రత్యేక విధుల అధికారి (OSD)గా నియమించిన ప్రభుత్వం, కేవలం 24 గంటల్లోనే ఆ నియామకాన్ని రద్దు చేసింది.
మంగళవారం విడుదలైన ఉత్తర్వుల్లో, రిక్కీ రాధాన్ పండిట్ వెట్రివేల్‌ను ముఖ్యమంత్రి (రాజకీయ) OSDగా నియమిస్తున్నాం.. అని టీవీకే ప్రధాన కార్యదర్శి రీతా హరీష్ తక్కర్ పేర్కొన్నారు. అయితే ప్రతిపక్షాల విమర్శలు తీవ్రం కావడంతో మరుసటి రోజే ఆ నియామకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది.
ఎన్నికలకు ముందు విజయ్ ఘన విజయం సాధిస్తారని, అది “సునామీ విజయంలా” ఉంటుందని పండిట్ వెట్రివేల్ ముందుగానే అంచనా వేసినట్లు ప్రచారం జరిగింది. మొదటగా విజయ్ తన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మే 10న మధ్యాహ్నం 3:45 గంటలకు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే తర్వాత దానిని ఉదయం 10 గంటలకు మార్చారు. ఈ సమయ మార్పును వెట్రివేల్ సూచించినట్లు, కొత్త సమయం మరింత “శుభప్రదం” అని ఆయన చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
ఎవరు ఈ రిక్కీ రాధాన్ పండిట్ వెట్రివేల్?
తమిళనాడులోని ఈరోడ్‌కు చెందిన వెట్రివేల్ ప్రముఖ జ్యోతిష్కుడిగా పేరు తెచ్చుకున్నారు. వేద జ్యోతిష్యం, న్యూమరాలజీ, ధ్యాన ఆధారిత సలహాల్లో ఆయనకు నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం ఉందని చెబుతారు.
జయలలితతో వెట్రివేల్‌కు సంబంధం ఏంటి?
ఒకప్పుడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత( J. ayalalithaa) కు కూడా వెట్రివేల్ వ్యక్తిగత జ్యోతిష్కుడిగా వ్యవహరించినట్లు ప్రచారం ఉంది. 1991 ఎన్నికల్లో జయలలిత విజయం సాధిస్తారని ముందుగానే అంచనా వేసినట్లు ఆయన చెప్పుకున్నారు. అలాగే 1994-1997 మధ్య కఠిన సమయం వస్తుందని హెచ్చరించానని కూడా పేర్కొన్నారు.
జయలలిత పేరును “J Jayalalitha” నుంచి “J Jayalalithaa”గా మార్చాలని సూచించిన వ్యక్తి కూడా తానేనని వెట్రివేల్ చెబుతుంటారు. అయితే అక్రమాస్తుల కేసులో ఆమె జైలుకు వెళ్లరని చెప్పిన అంచనా తప్పడంతో, ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు సమాచారం.
ప్రముఖులతో అనుబంధం
1996 నుంచి 1998 మధ్య ముంబైలో పలు ప్రముఖులకు జ్యోతిష్య సలహాలు ఇచ్చినట్లు వెట్రివేల్ చెబుతుంటారు. రిజర్వ్ బ్యాంక్ మాజీ డిప్యూటీ గవర్నర్ జగతీష్ కపూర్, ఐడీబీఐ మాజీ చైర్మన్ చక్రవర్తి, నటి మనీషా కోయిరాల( Manisha Koirala) తదితరులతో పనిచేసినట్లుగా వెట్రివేల్ చెప్పుకుంటారు.
2008లో ఢిల్లీకి వెళ్లిన తర్వాత “పండిట్ వెట్రివేల్” పేరును మార్చి “రాధాన్ పండిట్”గా పిలవడం ప్రారంభించారు. హిందీ తెలియకపోయినా ఇంగ్లీష్‌లో జ్యోతిష్య సలహాలు ఇచ్చి ఢిల్లీలో కూడా గుర్తింపు పొందారని ప్రచారంలో ఉంది. ఈ సమయంలో బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ( L. K. Advani) తో కూడా సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయని వెట్రివేల్ చెబుతుంటారు.
విజయ్ రాజకీయ ప్రయాణంలో పాత్ర
తర్వాత తమిళ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్‌కు వెట్రివేల్ దగ్గరయ్యారని సమాచారం. 2024లో విజయ్ తమిళనాడులో పెద్ద రాజకీయ శక్తిగా ఎదుగుతారని ముందుగానే అంచనా వేశారు. విజయ్ “V” అక్షరంతో ప్రారంభమయ్యే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సూచించినట్లు కూడా ప్రచారం జరిగింది.
ఎన్నికల సమయంలో పలు యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో పాల్గొన్న వెట్రివేల్, విజయ్ పార్టీ భారీ మెజార్టీ సాధిస్తుందని ప్రకటించారు
అయితే ఇప్పుడు ఆయనను OSDగా నియమించడం, వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం తమిళ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.


