- బోగీల్లో చెత్త సేకరణ వ్యవస్థలో మార్పునకు రైల్వే మంత్రి ఆదేశం
- మీడియా రిపోర్టులు, నెటిజన్ల రిక్వెస్టులకు స్పందించిన అశ్వినీ వైష్ణవ్

విమానాల్లో చెత్తసేకరణ, శుభ్రపరిచే విధానాన్ని వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లోనూ అవలంబించాలని రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ అధికారులను ఆదేశించారు. వందే భారత్ రైళ్లలో చెత్త ఉత్పత్తి, సేకరణ వ్యవస్థలో మార్పు కోసం రైల్వే ఉన్నతాధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఒక వ్యక్తి కోచ్‌లోని ప్రతి సీట్ వద్దకు వెళ్లి ఏదైనా చెత్త ఉంటే వేయమని కోరుతూ చెత్త సేకరణ సంచిని తరలిస్తారు. ఈ విషయంలో ప్రయాణీకుల సహకారాన్ని కూడా కోరుతున్నట్లుగా రైల్వేమంత్రి ట్వీట్ చేశారు.

కొన్ని మీడియా రిపోర్టులలో, వందే భారత్ రైళ్లకు సంబంధించిన ఫోటోలు వచ్చాయని, ఆహార ప్యాకెట్లు, ఇతర చెత్త.. రైలు గమ్యస్థానానికి చేరుకున్నప్పుడు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లుగా పేర్కొన్నారు. అలాగే, కొంతమంది ఇంటర్నెట్ వినియోగదారులు కూడా ఈ సమస్యపై వెంటనే చర్య తీసుకోవాలని రైల్వేమంత్రికి విజ్ఞప్తి చేశారు.