పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఆసక్తిగా మారుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని సీపీఎం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీపీఎం నేతలు భేటీ అయ్యారు. సీఎం నివాసంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, వీరయ్య తదితరులు భేటీ అయ్యారు. ఎంపీ ఎన్నికల్లో మద్దతు విషయంలో వీరి మధ్య చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ భువనగిరి స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తసుకుంది. ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని సీపీఎం నిర్ణయించింది.
భువనగిరి పార్లమెంట్ తో పాటు ఇతర స్థానాల్లోనూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సీపీఎంను కోరినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ శక్తులను ఓడించేందుకు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చేందుకు వారు అంగీకరించారని చెప్పారు. దేశంలోనూ ఇండియా కూటమితో కలిసి పని చేస్తామన్నారు. సీపీఎం సహకారంతో భవిష్యత్ లో ముందుకెళ్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని సీపీఎం రాష్ట్ర కార్యాదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బీజేపీ, ఇతర శక్తులు అడ్డుకునేందుకు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.


