ఫిబ్రవరి 22 ఓ దుర్దినం. నాటి ఉదయం 8.30 గంటలు దురదృష్ట ఘటనా సమయం. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్, ఎస్ఎల్‌బీసీ ఆకస్మిక ప్రమాదం. టన్నెల్ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో, లోపల ఎనిమిది మంది శ్రమజీవులు చిక్కుకుపోయారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని కొలువైనా, కష్టాన్ని ఇష్టంగా చేసుకుని సేవలు అందిస్తున్న ఈ ధీశాలి శ్రమజీవులు… రోజు మాదిరి ఆ రోజున సేవలు అందిస్తుండగా.. పై నుంచి భూతంలా టన్నెల్ పై కప్పు కిందకు పడింది. ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజనీర్లు అందులో చిక్కుకు పోయారు. టన్నెల్ 14 వ కి.మీ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
టన్నెల్ లో చిక్కుపోయిన ఎనిమిది మంది ప్రాణాలు కాపాడడానికి సర్కారు అన్ని ప్రయత్నాలు సాగించింది. ఎస్ ఎల్ బీసీ టన్నెల్ లో సహాయక చర్యలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. మంత్రుల బృందంతో కలిసి సొరంగంలోకి వెళ్లిన సిఎం సహాయక చర్యల గురించి నిపుణులను అడిగి తెలుసుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. టన్నెల్ వద్ద సహాయక చర్యలను సీఎం స్వయంగా పరిశీలించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు.
టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులు జీవితులుగా ఉంటారనే ఆశలు పూర్తిగా సన్నగిల్లిన్నా… ఏమో ఏ మిరాకిల్ అయినా జరిగి కిల్ అవ్వకుండా ఉంటారేమో అని అందరూ భావించారు. ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనింగ్ బృందాలతోపాటు.. రెస్క్యూ టీమ్స్ టన్నెల్ లో తీవ్రంగా సహాయక చర్యలు చేపట్టాయి. టీబీఎం మిషన్‌ను దక్షిణ మధ్య రైల్వే నిపుణులు ప్లాస్మా గ్యాస్ కట్టర్స్‌తో కట్ చేశారు. నీటి ఊట ఆటంకంగా మారినా, టన్నెల్‌లోని బురద, శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా.. గ్రౌండ్ పెనిట్రెటింగ్ రాడర్ టెక్నాలజీతో కార్మికుల జాడ కోసం టన్నెల్‌లో స్కానింగ్ నిర్వహించారు. అయితే, చివరకు ఈ ఘటన విషాదమే మిగిల్చింది. మూడు మీటర్ల లోతులో ఎనిమిది మంది మృతదేహాలు లభ్యమయ్యాయి.
అధునాతన పరికరాలు, రాడార్‌లతో మృతదేహాలను గుర్తించినట్లు సహాయ చర్యలు చేపట్టిన ఓ అధికారి తెలిపారు. మృతుల్లో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజనీర్లు ఉన్నట్టు గుర్తించారు. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ మెషీన్ ద్వారా ప్రస్తుతం మూడు మృతదేహాలు బయటకు తీశారు. మట్టిలో కూరుకుపోయిన మిగిలిన అయిదు మృతదేహాలు గుర్తించారు. అయితే, వీటిని వెలికి తీయడానికి మరింత సమయం పట్టనుంది. నేషనల్ జియోగ్రాఫిక్ రీసర్చ్ ఇన్ స్టీట్యూట్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు సాగుతున్నాయి.