స్వతంత్ర వెబ్ డెస్క్: ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు 100 మందికిపైగా మృతి చెందినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అత్యధికంగా హిమాచల్ ప్రదేశ్‌లోనే 80 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. దీంతోపాటు ఆ రాష్ట్రంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. పలు రాష్ట్రాల్లో నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. పశ్చిమార్థ గోళంలో సంభవించే భౌగోళిక పరిణామాలు అతి చురుగ్గా ఉండటం, వాటికి రుతుపవనాలు తోడవ్వడంతో ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోవడం, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలు చోటు చేసుకొన్నాయి.
హిమాచల్ పర్వత ప్రాంతాల్లో దాదాపు 300 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. పంజాబ్, హర్యానాలలో కొన్ని ప్రాంతాల్లో వర్షాల కారణంగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. పొరుగున ఉన్న ఉత్తరాఖండ్‌లో గత 24 గంటల్లో కొండచరియలు విరిగిపడటంతో తొమ్మిది మంది యాత్రికులు మరణించగా.. 13 మంది గాయపడ్డారు. ఢిల్లీలో యమునా నది 205.33 మీటర్ల ప్రమాద స్థాయిని అధిగమించి నది ఒడ్డున ఉన్న పలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. నీటి మట్టం ప్రమాదకరంగా 207.49 మీటర్ల మార్కును తాకింది. ఇది 1978లో నమోదైన అత్యధిక రికార్డును అధిగమించింది. హర్యానా యమునానగర్‌లోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి యమునా నదిలోకి ఎక్కువ నీటిని విడుదల చేయడంతో పాత యమునా వంతెనపై రోడ్డు, రైలు ట్రాఫిక్ రెండూ మూసివేయబడ్డాయి.