స్వతంత్ర వెబ్ డెస్క్: పేదల సొంతింటి కలను నెరవేర్చడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) అన్నారు. గురువారం (2023 ఆగస్టు 24) హైదరాబాద్ కలెక్టరేట్ లో మంత్రి మహమూద్ అలీతో కలిసి ఆన్ లైన్ డ్రా పద్దతిలో డబుల్ బెడ్ రూం(Double Bedroom Houses) ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. సెప్టెంబర్ 2 లోగా కుత్బుల్లాపూర్ లో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీని ప్రారంభిస్తామని మంత్రి తలసాని తెలిపారు. గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్ ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేస్తారని పేర్కొ్న్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంలో దేశంలోనే మొదటి సారి డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ఆన్ లైన్ లో చేపట్టామన్నారు.
ఎన్ఐసి రూపొందించిన రాండమైజేషన్ సాఫ్ట్‌వేర్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని తలసాని అన్నారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారి నుంచి లబ్ధిదారుల ఎంపిక చేస్తామని ప్రకటించారు. మరోవైపు హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఒక్కో నియోజకవర్గంలో మొదటి విడత 12 మందికి ఇండ్ల పంపిణీ చేస్తామని మంత్రి తలసాని అన్నారు. గత ప్రభుత్వం నామమాత్రపు ఆర్థిక సాయంలో ఇండ్లు నిర్మించిందన్నారు. సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి ఉచితంగా అందిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.