మావోయిస్టు మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ( Devji) దాదాపు 45 ఏళ్ల తర్వాత ఇంటర్ పరీక్షకు హాజరయ్యారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో బుధవారం జరిగిన ఇంటర్ తెలుగు పరీక్షను ఆయన రాశారు.
దేవ్‌జీ 1980-82 మధ్యకాలంలో కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ గ్రూప్‌లో ఇంటర్మీడియట్ చదివారు. ఆ సమయంలో విద్యార్థి రాడికల్ యూనియన్‌లో చురుకుగా పనిచేస్తూ రెండో సంవత్సరం తెలుగు పరీక్షను బహిష్కరించారు. అనంతరం ఆయన మావోయిస్టు ఉద్యమంలో చేరి అగ్రనేతగా ఎదిగారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో మావోయిస్టు ఉద్యమాన్ని వీడి సాధారణ జీవితంలోకి వచ్చిన దేవ్‌జీ, తన చదువును పూర్తి చేయాలనే సంకల్పంతో మళ్లీ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఇంటర్ బోర్డు ప్రత్యేక అనుమతితో కోరుట్లలోని మ్యాస్ట్రో జూనియర్ కళాశాలలో పరీక్ష రాశారు.
పరీక్ష అనంతరం మాట్లాడుతూ, న్యాయవాద విద్యను అభ్యసించి పేదల కోసం పనిచేయాలనేది తన లక్ష్యమని దేవ్‌జీ తెలిపారు. జీవితంలో చదువు ఎంతో ముఖ్యమని, యువత విద్య ద్వారా సమాజానికి సేవ చేయాలని సూచించారు.


