20.7 C
Hyderabad
Tuesday, March 18, 2025
spot_img

సాగునీళ్ల కోసం కర్షకుల కన్నీళ్లు – ఎండిన పంటలు చూసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి భావోద్వేగం

అది చేస్తాం, ఇది చేస్తాం, అది చేశాం, ఇది చేశాం…ఇవన్నీ వినసొంపు మాటలే. ఏది చేసినా, చేయకపోయినా.. అన్నదాతల విషయంలో.. కబుర్లు, కహానీలు, తేనెపలుకులు పలికి.. మాట తప్పితే.. అది కేవలం రైతన్నలకే కాదు.. యావత్ ప్రజలపైనా ఆ ప్రభావం పడుతుంది. అందుకే ఓ సినీ రచయిత.. అన్ని వర్గాల ప్రజల బంద్ గురించి చెబుతూ.. కార్మికులే సమ్మె చేస్తే రైళ్లు, బస్సులు బంద్, మరో వర్గం హర్తాళ్ చేసే మరేవో కట్ అంటూ… మరి కర్షకులు కన్నెర్ర చేసి, పనికి సెలవు ప్రకటిస్తే.. ఏమవుతుంది. గుప్పెడు మెతుకులు బంద్ అవుతాయి. సాపాటు ఎటూ లేదని పాడుకోవడానికి.. ఇదేమీ ఆషామాషీ తంతు కాదు. అన్నప్రదాత అంటే సర్వప్రదాత కిందే లెక్క. అంతటి విశిష్టత కలిగిన కర్షకులకు కడగండ్లు తెప్పిస్తే…ప్రళయాలు వస్తాయి. తిండి కలిగితేనే కండ.. కండగలవాడే మనిషి అని గురజాడ పాటలు పాడుకుంటూ.. ఆయన అడుగుజాడల్లో వెళ్లడాన్ని విస్మరిస్తే.. ఆ మహనీయుని అవమానం చేసినట్టు కాదా..! తిండి కలిగితేనే కండ.. అన్నది.. ఆ తిండి కల్గచేసేవారిని అపురూపంగా చూసుకోవాలనే అర్థం ఆ మహాకవి రచనలో అంతర్గతంగా దాగి ఉంది.

రాష్ట్ర సర్కారు పెద్దలు…ఈ స్కీంలు, ఆ స్కీంలు.. ఆరు స్కీంలు పెట్టామన్నారు. అమలు చేస్తున్నామన్నారు. సంతోషమే. రైతు బాంధవులం అన్నారు రైతు బంధుతో అన్నదాతలతో ఈ బాంధవ్యం మరింత పెరిగిందన్నారు. రైతన్న కష్టం.. అందరికీ అరిష్టం, అన్నదాత క్షేమం, అందరికీ సంక్షేమం.. అనే మంచి మాటలకు మద్దతు తెలిపి.. రైతు శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్నామని పాలక పెద్దలు సెలవిచ్చారు. అయితే, నీళ్లుండి….రైతులకు కన్నీళ్లు రప్పించడం ఏమిటి..? విపక్షాలు ఆరోపిస్తున్నట్టు.. కక్షలు, కార్పణ్యాల కోసమా.. ఆ పక్షాలు అంటున్నట్టు పాత ప్రభుత్వానికి పేరు వచ్చేస్తుందనా..లేక వేరేమైనా కారణం ఉందా..? వారబందీలు, సగం సగం నీళ్లు ఇస్తే.. నిక్షేపంలాంటి పంటలు ఎండిపోకుండా.. ఏపుగా పెరుగుతాయా..? గొర్రెలు, మేకలు ఎండు గడ్డిని నములుతుంటే.. విపక్షాలకు కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. ఇది నిజమే.. అయితే….వాళ్లు రాజ్యం ఏలుతున్నప్పుడు.. అలా నీళ్లిచ్చేశాం, ఇలా ఇది చేసేశాం అంటున్నారు. అయితే, మరెందుకు ప్రజలు ఇంటికి పంపించారు. అధికార పక్షాలైనా, విపక్షాలైనా..ఎవరైనా.. డ్రామాలు, వేషాలు కాకుండా.. నికార్సుగా, నిజాయితీగా ప్రజాసేవలో తరించాలి. ఎవరి విషయంలో ఏ ఆపేక్షలు ప్రదర్శించినా రైతన్న విషయంలో ఉపేక్ష వహిస్తే.. అందుకు మూల్యం చెల్లించుకోవడం ఖాయం.

ఇంకా క్యాలెండర్ నెల మార్పులో మార్చి నెల వచ్చిందో లేదో.. ఇప్పుడే ఎండలు మండిపోతున్నాయి. దీనికి సాయం ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ పెద్దలు, శాస్త్రవేత్తలు ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో తాగునీరు, సాగునీరు విషయంలో ఎంతో అప్రమత్తం అవ్వాల్సి ఉంది. అన్ని విషయాల్లో ఎడమొహం, పెడమొహం, కమ్ ఫైట్, కమాన్ ఫైట్ అంటూ.. అధికార విపక్షాలు టాక్ ఫైట్ లు చేసుకుంటూ కూర్చుంటే పరిస్థితి మరింత విషమిస్తుంది. ఇక విషయంలోకి వస్తే… సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలో పలు గ్రామాల్లో వరి పంటలు ఎండిపోతున్నాయి. సాగునీరు అందించండి మహప్రభో అంటూ.. అన్నదాతలు.. అటు పాలకులను, ఇటు అధికారులను గొంతెత్తి వేడుకొంటున్నారు. వారబందీ.. అంటూ వారానికోసారి నీళ్లిస్తే.. కన్నీళ్లు తప్ప సాగునీళ్లిచ్చినట్టు కాదని విపక్షాలు అధికార పక్షంపై మండిపడుతున్నాయి.

కాంగ్రెస్ సర్కారు మొద్దు నిద్ర పోతోందా..? పంటలు ఎండిపోయి రైతన్నలు కన్నీరు పెడుతుంటే.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదా..? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి నిలదీశారు. ఎండిన పంటలను చూసి ఆయన చలించిపోయారు. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలో ఎస్ఆర్ఎస్ పీ కాలువ కింద పొలాలను ఆయన పరిశీలించారు. పెన్ పహాడ్ మండలం గాజుల మల్కాపురం రెవెన్యూ పరిధిలోని గ్యారకుంట గ్రామ పంచాయతీ గిరిజన రైతులు వేసిన వరిపంటకు ఎస్ ఆర్ ఎస్పీ కాలువ నీరు రాక పంటపొలాలు ఎండిపోతున్నాయి. రైతుల బాధలు విని ఆయన చలించిపోయారు. గ్యారకుంట తండా వద్ద ఎండిన వరిచేను మేస్తున్న గొర్రెలు, మేకలను చూసి ఆవేదన చెందారు. తీవ్ర భావోద్వేగానికి గురై కళ్లనీళ్లు పెట్టుకున్నారు.

కాళేశ్వరం నీటితో కేసీఆర్ కు పేరొస్తుందనే అక్కసుతోనే కాంగ్రెస్ సర్కారు ఈ రీతిన వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. గోదావరిలో పది వేల క్యూసెక్కుల నీటి లభ్యత ఉన్నా ఇసుక వ్యాపారం కోసం నీటిని విడుదల చేయడం లేదని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం నీటితో గతంలో పంటలు పండాయి, అదే తరహాలో సాగునీరు వస్తుందని రైతులు ఆశతో నాట్లు పెట్టారని, అయితే, రాష్ట్ర సర్కారు అసంబద్ధ తీరువల్లే… కృష్ణా, గోదావరి ఆయకట్టులో పొలాలు ఎండిపోయాయని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పాపమే అని జగదీశ్ రెడ్డి విమర్శించారు. గోదావరిలో పది వేల క్యూసెక్కుల నీటి లభ్యత ఉన్నా ఇసుక వ్యాపారం కోసం రైతులను ఎండబెడుతున్నారని ఆయన ఆగ్రహం చెందారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద బటన్ ఆన్ చేస్తే పంటలన్నీ పండుతాయని, కాళేశ్వరం తమ చేతికి ఇస్తే కేవలం మూడు రోజుల్లో చివరి ఎకరం వరకు నీళ్లు పారిస్తామని జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రభుత్వాన్ని నమ్మి పంటలు వేసి నష్టపోయామని రైతులు కన్నీళ్లపర్యంతం అయ్యారు. మరో వైపు, మరో ప్రతిపక్ష పార్టీ బీజేపీ సైతం రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఇక్కడి రైతన్నలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

సాగునీటి విడుదలలో ఏమైనా ఇబ్బందులు ఉంటే.. సిబ్బందితో వాటిని సరిచేసి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలకు సాగునీరు విడుదల చేసే ప్రక్రియ చేపట్టకపోతే.. ఇప్పటి వరకు ఏం చేసామని చెప్పుకుంటున్నారో.. అదంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారి.. ప్రజాగ్రహం పెల్లుబకడం ఖాయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Latest Articles

‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ చూశారా?

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్