తమిళనాడు(Tamilnadu) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కాంచీపురం జిల్లాలోని బాణాసంచా తయారీ యూనిట్‌లో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు దుర్మరణం చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కూడా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు దాటికి సమీపంలో ఉన్న నాలుగు పూరిళ్లు ధ్వంసమయ్యాయి. ఆ ప్రాంతమంతా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 35 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.