అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారో లేదో అనేక దేశాలతో కయ్యానికి కాలు దువ్వడం మొదలెట్టారు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాలపై టారిఫ్ యుద్దం ప్రకటించారు ఆయన. కాగా తాజాగా పనామా కాలువపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ఎప్పటి నుంచో చెబుతున్నారు. కాగా త్వరలోనే ఇందుకు సంబంధించి కీలక పరిణామాలు ఉంటాయన్నారు అమెరికా అధ్యక్షుడు. అవసరమైతే, సైనిక చర్యలకు దిగుతామన్న సంకేతాలు కూడా ట్రంప్ ఇచ్చారు. కాలువకు సంబంధించిన ఒప్పందాన్ని పనామా ఉల్లంఘిస్తోందన్నారు ట్రంప్. అందుకనే కాలువను తిరిగి స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నామన్నారు. పనామా కాలువను పరోక్షంగా చైనా నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందేనన్నారు.
అమెరికా బెదిరింపుల నేపథ్యంలో పనామా దేశం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ నుంచి తాము వైదొలగుతున్నట్లు పనామా అధ్యక్షుడు జౌస్‌రౌల్ ములినో ప్రకటించారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్‌లో చేరడానికి 2017 లో చైనాతో చేసుకున్న ఒప్పందాన్ని ఈసారి పునరుద్ధరించబోవడం లేదంటూ పనామా అధ్యక్షుడు ములినో స్పష్టం చేశారు. పనామా అంశంపై ట్రంప్ వైఖరి వివాదంగా మారిన నేపథ్యంలో ములినో నిర్ణయం చర్చ కు దారితీసింది.
ప్రస్తుతం వివాదంగా మారిన పనామా కాలువను 1914లో అమెరికా నిర్మించింది. ఆ తరువాత కాలువకు సంబధించి అమెరికా, పనామా మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా 1999 డిసెంబర్ లో కాలువను పనామాకు ఇచ్చేసింది అమెరికా. ఇదిలా ఉంటే అమెరికా వాణిజ్య, నావికాళ నౌకల నుంచి పనామా దేశం భారీగా రుసుం వసూలు చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. ఈ రుసుంను తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. లేదంటే …పనామా కాలువను తిరిగి అమెరికా స్వాధీనం చేసుకుంటుందని ట్రంప్ హెచ్చరించారు. దీంతో అమెరికా, పనామా మధ్య వివాదం రాజుకుంది.