తెలంగాణ నుంచి రాజ్యసభ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్విని బలపరుస్తూ సీఎల్పీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానం ద్వారా ఏఐసీసీకి సీఎల్పీ ధన్యవాదాలు తెలిపింది.
ఇవాళ ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొంటారు.
కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో అభిషేక్ సింఘ్వీని ఎమ్మెల్యేలకు పరిచయం చేశారు సీఎం రేవంత్. ఆయన రాజ్యసభ సభ్యుడు కావాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యేలకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలులో అనేక రాజ్యాంగ, న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని అన్నారు. 2014 పునర్విభజన చట్టాన్ని పదేళ్లపాటు కేంద్రం అమలు చేయలేదని విమర్శించారు. పునర్విభజన చట్టంలోని అంశాలను చట్టసభలతోపాటు సుప్రీంకోర్టులో బలంగా వాదన వినిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకే రాజ్యాంగ, న్యాయ కోవిదుడు అయిన అభిషేక్ సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని అధిష్టానాన్ని కోరామన్నారు సీఎం రేవంత్.
ఇక సీఎల్పీ సమావేశం ముగిసిన అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కచ్చితంగా అవుతుందన్నారాయన. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయని..అందుకు సంబంధించిన కచ్చితమైన సమాచారం తమ దగ్గర ఉందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో చాలా చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయిందని.. హరీష్‌రావు, కేటీఆర్ నియోజకవర్గాల్లో తక్కువ ఓట్లు వచ్చాయన్నారు. తాము కనీసం ప్రచారం చేయకపోయినా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మూడు సీట్లు వచ్చాయని కోమటిరెడ్డి గుర్తు చేశారు.