ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ వివాదానికి దారి తీసింది. బీజేపీ కౌన్సిలర్‌ను కాంగ్రెస్ నేతలు కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కార్యాలయాన్ని బీజేపీ నేతలు ముట్టడించారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కౌన్సిలర్ రాజేష్‌ను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకెళ్లారు. పార్టీలో చేర్పించడం కోసం కాంగ్రెస్ నాయకులు తీసుకెళ్లారంటూ బీజేపీ నేతలు కాంగ్రెస్ కార్యాలయానికి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది.
ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్‌పై ఈ నెల 18న అవిశ్వాస పరీక్ష జరగనుంది. మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు బలం తక్కువగా ఉండడంతో బీజేపీతో పాటు బీఆర్ఎస్ కౌన్సిలర్లను లాగే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ ఈ క్రమంలోనే బీజేపీ తిర్పెల్లి కౌన్సిలర్ రాజేష్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం కావడం.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉన్నాడని తెలుసుకున్న బీజేపీ శ్రేణులు ర్యాలీగా తరలివెళ్లారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగారు.
బీఆర్ఎస్‌తో పాటు బీజేపీ నుంచి పలువురు కౌన్సిలర్లు వరుసగా హస్తం గూటికి చేరుకుంటున్నారు. వైస్ చైర్మన్ జహీర్ రంజని బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో మొత్తం 33 మంది కౌన్సిలర్లు ఆయనను పదవి నుంచి తొలగించడం కోసం కలెక్టర్‌కు నోటీసులు ఇచ్చారు. కలెక్టర్ ఈ నెల 18న అవిశ్వాస తీర్మానం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించగా రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ చేరికలపై దృష్టి సారించగా ఇప్పటికే పలువురు కౌన్సిలర్లు హస్తం గూటికి చేరారు. తాజాగా బీజేపీ కౌన్సిలర్ రాజేష్ చేరిక అంశం రచ్చకు దారితీసింది.