పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది తెలంగాణ కాంగ్రెస్. ఈ క్రమంలోనే జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. పీసీసీ చీఫ్‌గా కాంగ్రెస్ పాలన పగ్గాలు చేతపట్టిన మహేష్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశాలు జరగనున్నాయి. గాంధీభవన్ వేదికగా రోజుకి మూడు జిల్లాల చొప్పున ఉదయం 11 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకూ భేటీ జరగనుంది. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లా నేతలతో భేటీ అయ్యారు మహేష్‌గౌడ్. ఆ మధ్యాహ్నం 2 గంటలకు వరకూ జరిగే ఈ సమావేశం అనంతరం సాయంత్రం 4 గంటల వరకు కరీంనగర్ ఆ తర్వాత 4 6 గంటల వరకు నిజామాబాద్ జిల్లా నేతలతో సమీక్ష సమావేశాలు వరుసగా జరగనున్నాయి. జిల్లా ఇంచార్జీ మంత్రి, జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు ఈ మీటింగ్‌కు హాజరుకానున్నారు.
జిల్లాల వారీగా పార్టీని పటిష్టం చేస్తూనే.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఈ సమావేశాలను ప్లాన్ చేసింది కాంగ్రెస్. అలాగే క్షేత్ర స్థాయిలో పార్టీ మీద పీసీసీ చీఫ్ పట్టు సాధించేందుకు ఈ సమీక్ష సమావేశాలు కలసి వస్తాయని పార్టీ భావిస్తుంది. వాటితో పాటుగానే పాత, కొత్త నేతలను సమన్వయం చేయడం, క్షేత్ర స్థాయి పరిస్థుతులు సైతం నయా బాస్‌కి తెలిసివస్తాయని భావిస్తోంది.
మొన్నటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిపాలైన నియోజకవర్గాల మీద ప్రత్యేక ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. దీంతో ఓటమి పాలైన అభ్యర్థులు ఈ భేటీకి హాజరుకావాలని సమాచారం అందించింది గాంధీభవన్. అయితే,..నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం దిశగా ఈ సమావేశాల్లో కీలక నిర్ణయాలు ఉండనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే గత ప్రభుత్వ హాయంలో దాదాపుగా అన్ని లోకల్ బాడిలలో BRS నేతలు ఉన్నారు. దీంతో పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని పార్టీ భావిస్తుంది. అందుకే నేతలందరినీ ఐక్యం చేస్తూనే.. గ్రౌండ్ లెవల్‌లో పార్టీని బలపరచాలన్న వ్యూహంలో ఉంది.
ముఖ్యంగా కాంగ్రెస్ వీక్‌గా ఉన్న జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డిలతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గులాబి, కాషాయ పార్టీలు బలంగా ఉన్నాయి. గత పదేళ్లు ఈ జిల్లాల్లో పట్టు సాధించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నా అది ఇప్పటి వరకూ సాధ్యపడలేదు. పార్టీని ముందుండి నడిపించే బలమైన నేతలు పార్టీకి కరువవ్వడమే అందుకు కారణం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనంతరం హస్తంలోని బలమైన నేతలంతా ఇతర పార్టీల్లోకి వెళ్లడంతో అప్పటి నుంచి పార్టీ బలహీనంగా మారింది. ఇప్పటికైనా గ్రేటర్‌లో పార్టీని బలోపెతం చేసి పూర్వ వైభవాన్ని చాటాలన్న వ్యూహంలో ఉంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలోనే జిల్లా స్థాయి సమావేశాలను నిర్వహిస్తోంది.