తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని అమెరికాలోని ఐటీ సర్వీసెస్ కంపెనీల ప్రతినిధులకు పిలుపునిచ్చారు రేవంత్. ఐటీ సంస్థల అసోసియేషన్ ఐటి సర్వ్ అలయన్స్ సమావేశంలో.. మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు పాల్గొన్న ఆయన.. హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో ప్రవాసులు భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ సందర్భంగా ఎన్నో ఏళ్లుగా కష్టపడి చారిత్రాత్మకమైన హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లను నిర్మించుకున్నామని.. ఇప్పుడు అందరం కలిసి ప్రపంచ స్థాయి నాల్గవ నగరంగా ఫ్యూచర్ సిటీని తయారు చేసుకుంటున్నామని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్. ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి తప్పకుండా భవిష్యత్తుకు పెట్టుబడిగా ఉపయోగపడుతుందని ప్రవాస భారయతీయులను ఉద్దేశించి మాట్లాడారు రేవంత్.
ఆర్థిక సేవలలో గ్లోబల్ లీడర్ అయిన చార్లెస్ స్క్వాబ్ భారతదేశంలో తన మొదటి టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించనుంది. ఇందుకు హైదరాబాద్‌ను వేదికకానుంది. డల్లాస్‌లోని చార్లెస్ స్క్వాబ్ వరల్డ్ హెడ్‌క్వార్టర్స్‌లో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబు, సీనియర్ స్క్వాబ్ ఎగ్జిక్యూటివ్‌లు డెన్నిస్ హోవార్డ్, రామ బొక్కా సమావేశమయ్యారు. చివరగా ఇండియాలో టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో తమ చార్లెస్ స్క్వాబ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను నెలకొల్పడానికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు సీఎం రేవంత్.