గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బాలింతలకు అందజేసిన ‘ఎన్టీఆర్ బేబీ కిట్స్’ పథకాన్ని మళ్లీ ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై మంత్రి సత్యకుమార్‌యాదవ్, ఆ శాఖ ప్రధాన కార్యదర్శి కృష్ణబాబుతో కలిసి సీఎం సమీక్షించారు. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పీపీపీ విధానంలో స్పెషాల్టీ ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఆదేశించారు. వీటి ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థలకు ప్రభుత్వమే స్థలం కేటాయిస్తుందని చెప్పారు. ప్రభుత్వ, పీపీపీ ఆసుపత్రులను ఒకే గొడుగు కిందకు తేవాలని చెప్పారు. రాష్ట్రంలోని ఆసుపత్రుల పనితీరు దేశంలోనే ఉత్తమంగా ఉండాలని చంద్రబాబు సూచించారు.
విశాఖలోని మెడ్‌టెక్ జోన్ పట్ల నాటి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని గుర్తుచేసిన చంద్రబాబు.. అక్కడ ఏటా 10 వేల కోట్ల టర్నోవర్ జరుగుతోందని, తక్కువ ఖర్చుతో అన్నిరకాల వైద్య పరికరాలు తయారయ్యే మెడ్‌టెక్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లోని ఫీడర్ అంబులెన్సులు, సాధారణ అంబులెన్స్‌ల మధ్య అనుసంధానం పెంచాలని చెప్పారు. ఇంకా డోలీతో గర్భిణులు, బాలింతలను మోసుకొస్తున్న దృశ్యాలు కన్పిస్తున్నాయన్నారు. వీటిని నియంత్రించకుంటే, అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫీడర్ అంబులెన్స్‌లు వెళ్లగలిగినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తే, అలాంటి ప్రాంతాలను స్వయంగా సందర్శిస్తానని చంద్రబాబు చెప్పారు. 104 అంబులెన్సుల పట్ల ప్రజల సంతృప్తి ఎలా ఉందో గమనించాలని సూచించారు. ఆసుపత్రుల్లో చనిపోయిన వారి భౌతికకాయాలను ఇళ్లకు తరలించేందుకు అవసరమైతే అంబులెన్సులు వాడాలని అన్నారు. ప్రభుత్వం తరఫున యాప్ రూపొందించి హెల్త్ కార్డు ద్వారా ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన రోగుల వివరాలు పొందుపరచాలని చంద్రబాబు ఆదేశించారు.
గతంలో ఉద్దానంలో పూర్తిస్థాయిలో పరిశోధన చేయడం వల్లే సమస్యను గుర్తించగలిగామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పుడు మరికొన్ని ప్రాంతాల్లోనూ కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని… రాష్ట్రంలో కిడ్నీ బాధితులు ఎంతమంది ఉన్నారు? కారణాలేంటి అన్నది మండలాల వారీగా వివరాలు సేకరించాలని చెప్పారు. కిడ్నీ వ్యాధులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నీటి వనరులు, నాణ్యతపై లోతుగా అధ్యయనం చేయాలని అన్నారు. పేదలకు అందుబాటులో ఉండేలా సీటీ స్కాన్ సర్వీసెస్‌ను తొలుత అన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో ఏర్పాటుచేయాలని చెప్పారు. రాష్ట్రంలో టీబీ రోగులపై సమగ్ర అధ్యయనం చేసి, వారికి క్రమం తప్పకుండా మందులు అందించాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో నవజాత శిశువుల మిస్సింగ్ కేసులు నమోదైతే, అధికారులపై చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు. టెలి మెడిసిన్‌పై ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి, రాష్ట్రంలోనూ ప్రారంభించాలని ఆదేశించారు. పింఛన్ కోసం నకిలీ వైకల్యం సర్టిఫికెట్లు సృష్టించకుండా ‘సదరం’ శిబిరాలను పర్యవేక్షించాలని ఆదేశించారు చంద్రబాబు.